షమీకి కోచింగ్ బాధ్యతలు ఇవ్వండి.. బీసీసీఐకి మాజీ కెప్టెన్ కీలక సూచన!

షమీకి కోచింగ్ బాధ్యతలు ఇవ్వండి.. బీసీసీఐకి మాజీ కెప్టెన్ కీలక సూచన!

టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీకి భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ కీలకమైన ప్రతిపాదన చేశారు. షమీ తన అపారమైన అనుభవాన్ని భవిష్యత్ తరాలకు పంచాలని, బీసీసీఐ అతనికి కోచింగ్ బాధ్యతలు అప్పగించాలని అజారుద్దీన్ కోరారు. భారత పేస్ విభాగంలో షమీ సేవలను కొనియాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అజారుద్దీన్.

కపిల్ దేవ్‌తో పోలిక.. షమీ అరుదైన ప్రజ్ఞ:

భారత్‌లో లెజెండరీ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ తర్వాత మనం చూసిన అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో షమీ ఒకడని మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ప్రశంసించారు. నేరుగా కపిల్ దేవ్‌తో పోల్చలేకపోయినప్పటికీ, షమీ బౌలింగ్ ప్రతిభ మాత్రం అదే స్థాయిలో అద్భుతంగా ఉంటుందన్నారు. దేశంలో ప్రతిభావంతులైన యువ పేసర్లకు ఎలాంటి కొరత లేదని, వారి కెరీర్‌ను మరింత మెరుగుపరచడానికి, ఒత్తిడిని తట్టుకునే మెలకువలు నేర్పడానికి షమీ వంటి సీనియర్ అనుభవం ఎంతైనా అవసరమని అభిప్రాయపడ్డారు.

షమీ నెక్ట్స్ టార్గెట్: 

36 ఏళ్ల షమీ టెస్టులకు గుడ్‌బై చెప్పినప్పటికీ, వైట్‌బాల్ క్రికెట్‌లో (వన్డే, టీ20) కొనసాగాలని భావిస్తున్నాడు. ముఖ్యంగా వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ టోర్నీకి టీమిండియాలోకి రీఎంట్రీ చేయడమే తన ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాడు. దీనికోసం దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తూ ఫిట్‌నెస్ నిరూపించుకుంటున్నప్పటికీ, జాతీయ జట్టులోకి సెలెక్టర్ల పిలుపు కోసం ఇంకా ఎదురుచూడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో షమీ తన ఆటను కొనసాగిస్తాడా? లేక అజారుద్దీన్ సూచించినట్లు కోచింగ్ వైపు అడుగులు వేస్తాడా? అనేది ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.