వరుస హాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా అడపాదడపా నిర్మాతగానూ మెప్పిస్తున్నారు. ఆమె నిర్మాతగా తాజాగా ఓ కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ‘వెంటిలేటర్ 2’ పేరుతో ఈ మరాఠీ చిత్రం రూపొందుతోంది. 2015లో మధు చోప్రాతో ఆమె నిర్మించిన ‘వెంటిలేటర్’కు ఇది సీక్వెల్. రాజేష్ మపూస్కర్ డైరెక్షన్‌లో రూ.3 కోట్లతో రూపొందిన ఈ చిత్రం రూ.25 కోట్ల వరకు రాబట్టి అప్పట్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మరాఠీ చిత్రంగా నిలిచింది. అంతేకాదు మూడు జాతీయ అవార్డులను కూడా గెలుచుకుంది.
తన బ్యానర్‌లో వచ్చిన గొప్ప చిత్రాల్లో ‘వెంటిలేటర్’ ఒకటని, దశాబ్ధం తర్వాత దానికి సీక్వెల్‌ను చేయనుండటం సంతోషంగా ఉందని ప్రియాంక ప్రకటించారు. ఇక ఫస్ట్ పార్ట్‌లో గెస్ట్ రోల్‌లో మెరిసిన ప్రియాంక ఇందులోనూ నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గణేష్ ఉత్సవాలు సమీపిస్తున్న సమయంలో తమ ఇంటి పెద్ద గజానన్ కామెర్కర్ అలియాస్ గజ్జు కాకా హాస్పిటల్‌లో చేరడంతో ఉత్సవాల వరకు ఆయన్ను బతికించుకోవాలని కామేర్కర్ కుటుంబ సభ్యులు వెంటిలేటర్‌పై ఉంచుతారు. ఈ నేపథ్యంలో జరిగిన కుటుంబ గొడవలు, ఎమోషన్స్‌తో సాగే కామెడీ డ్రామా. సీక్వెల్ కూడా కామేర్కర్ ఫ్యామిలీ చుట్టూనే ఉండబోతోందని సమాచారం. ఇక మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ చిత్రంలో ప్రియాంక చోప్రా కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
