- రేపటి నుంచే కొత్త ధరలు
న్యూఢిల్లీ: క్యాన్సర్ రోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. 137 రకాల క్యాన్సర్ మందులపై ట్రేడ్ మార్జిన్లను తగ్గించింది. దీంతో సోమవారం నుంచి వీటి ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. ఫలితంగా వినియోగదారులకు ఏటా సుమారు రూ.3,502 కోట్ల మేర ఆదా కానుంది.
నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) ఆదేశాల మేరకు ఇప్పటికే 76 ఫార్మా కంపెనీలు 121 రకాల మందులకు సంబంధించిన 1,225 ఫార్ములేషన్ల కొత్త ధరలను ప్రకటించాయి.
వీటిలో 1,031 ఫార్ములేషన్ల ధరలు తగ్గాయి. 600 బ్రాండ్లపై 50 శాతానికి పైగా కోత పడగా, అత్యధికంగా 96.45 శాతం తగ్గింపు నమోదైంది. రిటైలర్లు, ఆసుపత్రులు కొత్త ధరల పట్టికలను ప్రదర్శించాల్సి ఉంటుంది. వినియోగదారులు ఎన్‌పీపీఏ వెబ్‌సైట్, ఫార్మా సహీ దామ్ యాప్ ద్వారా ధరలను తెలుసుకోవచ్చు.
