భూమి మీద నూకలుంటే...ఎంత పెద్ద ప్రమాదం జరిగినా బతుకుతాం అనడానికి నిదర్శనం ఈ ఘటన. చనిపోదామని నదిలో దూకిన మహిళను మొసలి కాటేసి ప్రాణం కాపాడింది. కర్ణాటకలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... కర్ణాటకలోని కుమారధార నదిలో ఆత్మహత్య చేసుకోవాలని దూకింది ఓ మహిళ. ఆమె నదిలో దూకిన సమయంలో మొసలి దాడి చేయడంతో కేకలు వేయగా స్థానికులు ఆమెను రక్షించారు.
వ్యక్తిగత సమస్యలతో మనోవేదనకు గురైన ఆ మహిళ ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో నదిలోకి దూకిందని...ఆమె నీటిలో ఉండగా మొసలి కరిచిందని, దీంతో సహాయం కోసం కేకలు వేసిందని తెలిపారు పోలీసులు. సమీపంలోని లాడ్జి ఉద్యోగులు ఆమె కేకలు విని పోలీసులకు సమాచారం అందించారని... ఒక బృందం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో ఆమెను నదిలోంచి బయటకు తీసి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారని తెలిపారు.
ఆ తర్వాత ఆమెను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్ళి ప్రథమ చికిత్స అందించామని తెలిపారు. అనంతర ఆమె కుటుంబసభ్యులను కలిసి కౌన్సిలింగ్ ఇచ్చి ఆమెను అప్పగించినట్లు తెలిపారు పోలీసులు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని... ఆమె కుటుంబసభ్యులు అభ్యర్థన మేరకు మహిళ వివరాలు వెల్లడించలేదని తెలిపారు పోలీసులు.
