రాయ్పూర్: దేశంలోని ప్రతి జిల్లా నక్సలిజం రహితంగా మారిందని.. లక్షలాది మంది ప్రజలు మావోయిస్టు భయం నుంచి విముక్తి పొందారని ప్రధాని మోడీ తెలిపారు. ఒకప్పుడు నక్సలైట్ల ప్రాబల్యంతో అశాంతిగా ఉన్న బస్తర్ ప్రాంతం.. ఇవాళ భద్రతా బలగాల త్యాగాలు, అంకితభావం కారణంగా శాంతి, ప్రగతి పథంలో దూసుకుపోతోందని పేర్కొన్నారు.
దశాబ్దాలుగా సాగుతున్న నక్సలిజం, మావోయిస్టు హింసపై దేశం ఒక గొప్ప మైలురాయిని సాధించిన తర్వాత వచ్చిన మొదటి చారిత్రాత్మక దీపావళి ఇదని అన్నారు. ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా ఉన్న బస్తర్లో భద్రతా దళాలతో కలిసి ప్రధాని మోడీ ఈ ఏడాది దీపావళి వేడుకలు జరుపుకున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీ ప్రతియేటా దీపావళి వేడుకలను దేశ రక్షణలో నిమగ్నమైన సైనికులతో కలిసి జరుపుకునే వారు. కానీ ఈ ఏడాది మావోయిస్టు కంచుకోట బస్తర్లో జవాన్లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జవాన్లను ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడుతూ.. దేశ సరిహద్దు, దేశం లోపల శాంతిభద్రతలను కాపాడుతూ పహారా కాస్తున్న జవాన్లందరినీ తన కుటుంబ సభ్యులుగా అభివర్ణించారు. కోట్లాది మంది భారతీయులు తమ ఇండ్లలో కుటుంబాలతో కలిసి సంతోషంగా పండుగ జరుపుకుంటుండగా.. తను మాత్రం తన కుటుంబమైన భద్రతా దళాల మధ్యకు వచ్చి దీపావళి జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. బస్తర్ జవాన్ల త్యాగాలను, దేశ రక్షణలో వారి అమూల్యమైన సహకారాన్ని గౌరవిస్తూ వారి మధ్యకు రావడం గర్వంగా ఉందన్నారు.
