ఇందిరమ్మ  ఇంట్లో సీఎం భోజనం..చిన్నారులతో దీపావళి సంబరాలు

ఇందిరమ్మ  ఇంట్లో సీఎం భోజనం..చిన్నారులతో దీపావళి సంబరాలు

సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ మండలంలోని పర్సాపూర్ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా నిర్మించిన ఇంటిని సీఎం ప్రారంభించారు.

పర్సాపూర్ గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు గోరిపల్లి సుమిత్ర, శ్రీనివాస్ దంపతుల నూతన గృహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారికి నూతన వస్త్రాలను బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఇంటి ప్రారంభోత్సవం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి లబ్ధిదారుల కుటుంబంతో కలిసి వారి ఇంట్లోనే భోజనం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యంతో తయారుచేసిన భోజనం తిన్నారు.

సీఎంతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు కూడా లబ్ధిదారుల ఇంట్లోనే భోజనం చేశారు. అనంతరం అక్కడున్న పిల్లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.  ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవం సందర్భంగా గ్రామంలో సందడి నెలకొంది. సీఎం రేవంత్ తమ ఇంటికి వచ్చి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొనడంతో లబ్ధిదారుల కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.