హైదరాబాద్: రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ (వీసీ) అల్దాస్ జానయ్యకు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. 2026, నవంబర్ 12వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు కమిషన్ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. వీసీ అల్దాస్ జానయ్య తనను లైంగికంగా వేధించాడని ఓ మహిళా ప్రొఫెసర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది.
వీసీ అల్దాస్ జానయ్యపై మహిళా ప్రొఫెసర్ లైంగిక వేధింపుల ఆరోపణలు
రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మహిళా ప్రొఫెసర్ వేధింపుల వ్యవహారం కలకలం రేపుతోంది. వీసీ అల్దాఫ్ జానయ్య తనను మానసికంగా, వ్యక్తిగతంగా వేధించారని ఓ మహిళా ప్రొఫెసర్ ఆరోపించారు. ఆఫీస్‌కు పిలిచే సమయంలో సెల్‌ఫోన్లు బయట పెట్టాలని చెప్పి, శరీరంలోని వ్యక్తిగత భాగాల గురించి అసభ్యకరంగా మాట్లాడేవారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
అర్ధరాత్రి వాట్సాప్ కాల్స్ చేస్తూ ఇబ్బందులకు గురిచేసేవారని, ఎన్నిసార్లు పట్టించుకోకుండా ఉన్నా వేధింపులు కొనసాగడంతో తీవ్ర మానసిక ఆవేదనకు గురయ్యానని తెలిపారు. ఈ వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించినట్లు ఆమె వెల్లడించారు. మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదును స్వీకరించిన కమిషన్.. వీసీ అల్దాస్ జానయ్యపై విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
