ఆమె ప్రముఖ డాక్టర్.. భర్త, తండ్రీ పెద్ద డాక్టర్లు.. అయినా బ్రెయిన్ స్ట్రోక్తో మృతి..

ఆమె ప్రముఖ డాక్టర్.. భర్త, తండ్రీ పెద్ద డాక్టర్లు.. అయినా బ్రెయిన్ స్ట్రోక్తో మృతి..

ఆమె ప్రముఖ డాక్టర్.. ఇంట్లో దాదాపు అందరూ డాక్టర్లే. భర్త, ఆమె తండ్రీ ఇద్దరూ డాక్టర్లే. పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉంది. అయినా బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోవడం చర్చనీయాంశంగా మారింది. వైద్య వర్గాల్లో, ప్రజల్లో   తీవ్ర విషాదాన్ని నింపింది. అతి చిన్న వయసులోనే న్యూరాలజిస్టుగా ఎదిగి.. పేదల డాక్టర్ గా పేరు తెచ్చుకున్న డాక్టర్ కుంకాల లావణ్య మృతి కలచి వేస్తేంది.    

చిరునవ్వుతో రోగులను పలకరిస్తూ ధైర్యం చెప్పే  ప్రముఖ న్యూరాలజిస్ట్, మాగుంట లేఅవుట్‌లోని ఎనెల్ (ENEL) స్పెషాలిటీ ఆస్పత్రి డైరెక్టర్  అయిన డాక్టర్ కుంకాల లావణ్య (32) శనివారం (2026 నవంబర్ 7) చనిపోయారు.  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంటకు చెందిన ఎనెల్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ కుంకాల దశరథ నాగేంద్ర ప్రసాద్, లక్ష్మి దంపతుల కుమార్తె డాక్టర్ లావణ్య.  2016లో నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆమె, బెంగళూరులోని సెయింట్ మార్తాస్ ఆస్పత్రిలో డీఎన్‌బీ (జనరల్ మెడిసిన్), చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎంసీ (SRMC) నుండి డీఎం (న్యూరాలజీ) లో గోల్డ్ మెడల్ సాధించారు.

 చిన్న వయసులోనే అత్యున్నత వైద్య విద్యను అభ్యసించినప్పటికీ, తక్కువ ఫీజులతో పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఆమె ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు.  చిరునవ్వుతో రోగులను పలకరిస్తూ ధైర్యం చెప్పే డాక్టర్ లావణ్య అకాల మరణం పట్ల పలువురు వైద్యులు, ప్రముఖులు,  ఆమె దగ్గర చికిత్స పొందిన రోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. 

అరుదైన నరాల వ్యాధిని జయించి...

డాక్టర్ లావణ్య వైద్యం అందేలోగా మృతి చెందడం ఆమె అభిమానులను దిగ్ర్భాంతికి గురిచేసింది. ప్రాణాంతక ఆటో ఇమ్యూన్ నరాల వ్యాధి నుంచి బయటపడిన లావణ్య.. బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోవడంతో కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

డాక్టర్ కుంకాల  లావణ్య చదువు, వృత్తి, వ్యక్తిగతం జీవితం సాఫీగా సాగుతున్న తరుణంలో ఊహించని కుదుపు ఎదురైంది. ఎంతో ఆరోగ్యంగా ఉన్న లావణ్యం 2025లో సడన్‌గా మాట్లాడే శక్తిని కోల్పోయారు. కనీసం నిలబడలేని స్థితికి చేరుకున్నారు. మెడికల్ టెస్ట్‌ల్లో ఆమెకు మయాస్తినియా గ్రావిస్ అనే అత్యంత అరుదైన ఆటో ఇమ్యూన్ నరాల వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. 

ఈ వ్యాధి గురించి తెలిసినా లావణ్య ఏ మాత్రం కుంగిపోలేదు. ఎంతో ధైర్యంతో ఆ వ్యాధిని జయించారు. కీలకమైన సర్జరీ చేయించుకున్నారు. అనంతరం రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పినా కేవలం నాలుగు నెలల్లోనే విధుల్లో చేరారు. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి ఉచితంగా న్యూరాలజీ పరీక్షలు, వైద్య సేవలు అందించడం మొదలుపెట్టారు.