మైలార్ దేవ్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ గోదాంలో చెలరేగిన మంటలు

మైలార్ దేవ్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ గోదాంలో చెలరేగిన మంటలు

హైదరాబాద్‌ మైలార్ దేవ్ పల్లిలోని  కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం  జరిగింది .ఓ ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు పక్కనే ఉన్న ఫ్లైవుడ్ దుకాణాలకు వ్యాపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. 

ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగడంతో భారీగా పొగ పరిసర ప్రాంతాలకు వ్యాపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

సమాచారం అందుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలు అగ్నిప్రమాదానికి కారణాలేంటి? షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయా? లేక మరేదైనా కారణమా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.