హైదరాబాద్ పాతబస్తీలో దీపావళి పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చార్మినార్ సమీపంలోని శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. దీపావళి సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు.. మహా హారతి
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి 7 గంటలకు మహాహారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి భక్తుల రాక పెరిగింది. హైదరాబాద్‌తో పాటు సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చారు.
అమ్మవారి ఖజానా నాణేల పంపిణీ
దీపావళి సందర్భంగా ఆలయంలో నిర్వహించే ఖజానా నాణేల పంపిణీ కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాత్రి 7 గంటలకు మహాహారతి అనంతరం ఖజానా పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. వెండి కానుకలతో ప్రత్యేకంగా తయారు చేసిన అమ్మవారి నాణేలను భక్తులకు ప్రసాదంగా అందిస్తున్నారు.ఈ నాణేలను అమ్మవారి ఆశీస్సులుగా భావించి భక్తులు స్వీకరిస్తున్నారు. ఖజానా నాణేల పంపిణీతో ఆలయ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ నిర్వాహకులు నాలుగు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు చార్మినార్ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
