కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో కాలిపోయిన మూడు గోదాములు

కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో కాలిపోయిన మూడు గోదాములు

హైదరాబాద్‌: కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆస్ బెస్టాస్ కాలనీలోని ఓ పేపర్‌ టీ కప్పులు, ప్లేట్ల తయారీ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు పక్కనే ఉన్న గోదాములకు వ్యాపించడంతో భారీగా ఆస్తినష్టం సంభవించింది.

ఈ ప్రమాదంలో మూడు నెయ్యి, చిప్స్‌ గోదాములు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. అలాగే అక్కడే పార్క్‌ చేసి ఉన్న ఐదు ఆటోలు, ఒక డీసీఎం వాహనం మంటల్లో కాలిపోయాయి. మంటల తీవ్రతకు పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్‌ సిబ్బంది, హైడ్రా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టారు.

ప్రాథమికంగా షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై విచారణ చేపట్టాల్సి ఉంది. ఈ ఘటనలో జరిగిన ఆస్తినష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.