హైదరాబాద్: దీపావళి పండుగ వేళ భాగ్యనగరంలో వరుస అగ్నిప్రమాదాలు కలకలం రేపాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో అగ్నికీలలు ఎగిసిపడటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్లాస్టిక్ పరిశ్రమలు, గోదాంలు, మెడికల్ షాపులు, టపాసుల దుకాణాల్లో మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు.
కాటేదాన్ పారిశ్రామిక వాడలోని ఓ ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమలో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న ప్లైవుడ్ యూనిట్‌కు వ్యాపించాయి. దీంతో రెండు యూనిట్లలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని ప్లాస్టిక్, స్క్రాప్ గోదాంలలోనూ మంటలు చెలరేగాయి.
సికింద్రాబాద్ బండిమెట్లోని బాలాజీ మెడికల్ షాప్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. అలాగే ఓల్డ్ బోయిన్‌పల్లిలో ఉన్న ఓ మెడికల్ గోదాంలో మూడో అంతస్తులో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
ఇక సికింద్రాబాద్ సీతాఫల్‌మండిలోని ఓ టపాసుల దుకాణంలోకి రాకెట్ దూసుకెళ్లడంతో ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో దుకాణంలో బాణసంచా వరుసగా పేలింది. పేలుళ్ల శబ్దాలతో పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి. భయాందోళనకు గురైన స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో చెత్త కుప్పల్లోనూ మంటలు చెలరేగాయి.
వరుస అగ్నిప్రమాదాల సమాచారంతో ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. పలు ప్రాంతాలకు ఫైర్ ఇంజిన్లను పంపించి మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. కొన్ని ప్రాంతాల్లో మూడు ఫైర్ ఇంజిన్ల సహాయంతో అగ్నిమాపక చర్యలు కొనసాగించారు.
ముఖ్యంగా ప్లాస్టిక్, ప్లైవుడ్ పరిశ్రమలు, గోదాంలలో మంటలు వ్యాపించడంతో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదాలకు టపాసుల పేలుళ్లు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అగ్నిప్రమాదాలకు గల అసలు కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.
