ఇరాన్‌తో యుద్ధం ఇంకా ముగియలేదు.. హిజ్బుల్లాకు ఇజ్రాయెల్ వార్నింగ్

ఇరాన్‌తో యుద్ధం ఇంకా ముగియలేదు.. హిజ్బుల్లాకు ఇజ్రాయెల్ వార్నింగ్

టెల్ అవీవ్: ఇరాన్‌తో తమ పోరాటం ఇంకా ముగియలేదని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ స్పష్టం చేశారు. అణ్వాయుధాల తయారీ ప్రయత్నాలను ఇరాన్ తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇరాన్‌కు మద్దతుగా యుద్ధంలోకి దిగితే హిజ్బుల్లా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో కాట్జ్ మాట్లాడుతూ.. ఇరాన్ అణ్వాయుధాలను సంపాదించేందుకు ప్రయత్నాలను పునరుద్ధరిస్తోందని, ఇది ఇజ్రాయెల్ భద్రతకు తీవ్రమైన ముప్పు అని  తెలిపారు. అయితే, అణ్వాయుధాల తయారీ ఆరోపణలను ఇరాన్ ఖండిస్తోంది. ఇరాన్‌పై మరోసారి దాడులు చేసే అవకాశాలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గత కొన్ని వారాలుగా హెచ్చరికలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై కొత్త సైనిక చర్యలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ఉంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు, ఇరాన్‌కు సంఘీభావంగా హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై దాడులకు దిగితే తీవ్రంగా ప్రతిస్పందిస్తామని కాట్జ్ హెచ్చరించారు. గాజా, లెబనాన్, సిరియాలో ఏర్పాటు చేసిన భద్రతా మండలాల నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.ఇజ్రాయెల్‌లో రాజకీయ పరిణామాలు కూడా యుద్ధంపై ప్రభావం చూపుతున్నాయి. నెతన్యాహు రాజకీయ ప్రయోజనాల కోసం యుద్ధ నిర్ణయాలు తీసుకోకూడదని ఆయన ప్రత్యర్థి గాడి ఐసెన్‌కోట్ హెచ్చరించినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, ఇరాన్‌తో ఉద్రిక్తతలు, హిజ్బుల్లా పాత్ర, అమెరికా వైఖరి నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితులు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇజ్రాయెల్ తదుపరి సైనిక వ్యూహం ఎలా ఉండబోతోందన్న దానిపై అంతర్జాతీయంగా ఉత్కంఠ నెలకొంది.