ఏంటండీ ఇది.. ఇంత ఘోరమా.. రాత్రి భోజనంలో భార్య వండిన కూర బాగోలేదన్నారు భర్త.. ఈ మాత్రం దానికే చంపేసిన భార్య.. ఏంటీ కూర బాగోలేదన్నందుకే చంపేసిందా అని ఆశ్చర్యపోవద్దు.. ఇది అక్షర సత్యం.. గుజరాత్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘోరం ఇప్పుడు వినటానికే.. చదవటానికే భయమేస్తోంది. వంటింట్లో కూరగాయలు కోసే కత్తితో.. భర్తను పొడిచి చంపేసిన భార్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అహ్మదాబాద్‌లోని నరోడా ప్రాంతంలో కూర బాగోలేదన్న కారణంగా జరిగిన ఘోర ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. రాత్రి పూట భోజనంలో వండిన కూరపై మొదలైన చిన్నపాటి గొడవ కాస్తా చివరకు ప్రాణాలను తీసేంతటి ఘాతుకానికి దారితీసింది. ఆర్మీలో దేశం కోసం సేవ చేసి రిటైర్ అయిన 39 ఏళ్ల దిలీప్ ఖరాడీని, ఆయన భార్య నిర్మలా ఖరాడీ కత్తితో గుండెల్లో పొడిచి దారుణంగా హత్య చేసింది.
నరోడా స్మార్ట్ సిటీ-2లో నివసించే ఈ దంపతుల మధ్య గత ఏడాది కాలంగా ఇల్లు, ఆర్థిక విషయాలపై తరచూ మనస్పర్థలు, గొడవలు జరుగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి సమయంలో భోజనం చేసే తరుణంలో రాత్రి కూర ఏమిటని దిలీప్ తన భార్యను ప్రశ్నించడంతో మాటామాటా పెరిగింది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి.. ఆగ్రహంతో ఊగిపోయిన నిర్మల ఒక్కసారిగా వంటగదిలోని కత్తిని తీసుకుని దిలీప్ ఎడమ ఛాతిపై బలంగా పొడిచింది.
ఈ ఘటన తర్వాత భర్త అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో నిర్మల వెంటనే తన బావ ముకేష్‌కు ఫోన్ చేసి తాను కత్తితో పొడిచినట్లు చెప్పింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో పరిస్థితి విషమించడంతో దిలీప్ మృతి చెందాడు. దిలీప్ భార్యతో గొడవలో గాయపడి చనిపోయినట్లు సమాచారం అందుకుని ఆసుపత్రికి చేరుకున్న దిలీప్ తండ్రి సోమాజీ ఖరాడీ.. తన కొడుకు ఛాతిపై కత్తిపోటు గాయాలను, చేతులపై ఉన్న గాయాలను చూసి కన్నీటి పర్యంతం అయ్యాడు.
ALSO READ : హైవేపై కారులో మంటలు..చిన్నారితో సహా ఆరుగురు సజీవ దహనం
హత్యపై కేసు నమోదు చేసుకున్న నరోడా పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సీసీటీవీ పుటేజీలు, స్థానిక సమాచారం ఆధారంగా గాలించి నిందితురాలు నిర్మలను గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు.
