నెయ్యి, వెన్న రేట్లు ఎందుకు విపరీతంగా పెరుగుతున్నాయ్? అసలు కారణాలు ఇవే!

నెయ్యి, వెన్న రేట్లు ఎందుకు విపరీతంగా పెరుగుతున్నాయ్? అసలు కారణాలు ఇవే!

భారతదేశంలో ప్రస్తుతం నెయ్యి, వెన్న ధరలు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. పాలు, మిల్క్-ఫ్యాట్ కొరత తీవ్రంగా వేధిస్తుండటం.. మరోవైపు వాడకం కూడా భారీగా పెరిగిపోవడం వంటి కారణాల వల్ల సామాన్యులకు నెయ్యి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా తయారీ ఖర్చులు పెరగడంతో డెయిరీ పరిశ్రమ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

గత కొంతకాలంగా ప్రభుత్వం తెస్తున్న పన్ను మార్పులు కూడా ధరల పెరుగుదలకు ఒక ప్రధాన కారణం. ప్రభుత్వాలు నెయ్యి, వెన్నపై జీఎస్‌టీ రేట్లను గతంలో ఉన్న 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాయి. ఈ పన్ను తగ్గింపు కారణంగా వినియోగదారులకు కొంత ఊరట లభించినప్పటికీ.. మార్కెట్లో ఈ హై-ఫ్యాట్ డెయిరీ ఉత్పత్తుల కొనుగోళ్లు, డిమాండ్ విపరీతంగా ఊపందుకున్నాయి. డిమాండ్ అంచనాలకు మించి పెరగడంతో డెయిరీల వద్ద నిల్వలు వేగంగా తగ్గిపోయాయి.

ఆహార భద్రతా ప్రమాదాలను నివారించేందుకు FSSAI, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కల్తీపై ఉక్కుపాదం మోపుతున్నాయి. వెజిటెబుల్ ఫ్యాట్ ఆధారిత నకిలీ ఉత్పత్తులపై నిషేధాలు, కల్తీ పాలు తరలిస్తున్న ట్యాంకర్ల నిలుపుదల వంటి కఠిన చర్యల వల్ల డెయిరీలు పూర్తిగా రైతుల నుంచి వచ్చే స్వచ్ఛమైన, అధిక సాలిడ్స్ ఉన్న పాలపైనే ఆధారపడాల్సి వచ్చింది. దీనికితోడు గత రెండేళ్లలో అంతర్జాతీయ మార్కెట్లలో అధిక ధరలు ఉన్న సమయంలో భారీగా నెయ్యి, వెన్న ఎగుమతులు జరగడం కూడా దేశీయంగా నిల్వలు అడుగంటడానికి కారణమైంది.

ప్రస్తుత మార్కెట్ లెక్కల ప్రకారం.. పచ్చి వెన్న కిలో రూ.550 నుంచి రూ.555 వరకు ఎక్స్-డెయిరీ ధర ఉండగా, దాని ఆధారంగా తయారయ్యే స్వచ్ఛమైన ఆవు నెయ్యి తయారీ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, రవాణా ఛార్జీలు, 5 శాతం జీఎస్‌టీ కలుపుకొని లీటరు రిటైల్ ధర సుమారు రూ.755 నుంచి రూ.762 వరకు పలుకుతోంది. ఇక ప్రత్యేకమైన ఏ2, బిలోనా రకాల నెయ్యి ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. మిల్క్ ఫ్యాట్ సప్లై మెరుగుపడే వరకు.. డిమాండ్-సప్లై మధ్య అంతరం తగ్గే వరకు ఈ ధరల పెరుగుదల ట్రెండ్ ఇలాగే కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. మరోపక్క ముంచుకొస్తున్న ఎల్‌నినో కారణంగా చాలా మంది రైతులు పశువులకు మేత లేక, నీళ్లు లేక పాడిని వదులుకోవటం కూడా పాలు, మిల్క్ ఫ్యాట్ తగ్గటానికి కారణంగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు.