డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు షేక్ హసీనా?.. కొత్త పాస్‌పోర్టు,గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు

డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు షేక్ హసీనా?.. కొత్త పాస్‌పోర్టు,గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు

Sheikh Hasina Seeks New Passport and National ID Ahead of Bangladesh Return

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు కీలక అడుగు వేశారు. కొత్త పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు (NID) జారీ చేయాలని కోరుతూ ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయానికి ఆమె తరఫు న్యాయవాదులు లేఖ రాశారు. డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లి కోర్టు ఎదుట లొంగిపోవాలనే యోచనలో భాగంగానే ఈ ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

లండన్‌కు చెందిన మ్యాట్రిక్స్ ఛాంబర్స్ న్యాయ సంస్థలో పనిచేస్తున్న హసీనా న్యాయవాదులు.. ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయ తాత్కాలిక హైకమిషనర్ ప్రీతి రెహమాన్‌కు ఈ లేఖ పంపారు. హసీనా బంగ్లాదేశ్ పౌరురాలిగా ఉన్నందున ఆమెకు కొత్త పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు జారీ చేయాలని కోరారు.

గతంలో తాత్కాలిక ప్రభుత్వం ఆమె పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డును రద్దు చేసినట్లు వచ్చిన నివేదికలను న్యాయవాదులు లేఖలో ప్రస్తావించారు. అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందాలు, బంగ్లాదేశ్ పౌరసత్వం ఆధారంగా ఆమెకు కొత్త పత్రాలు జారీ చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిశీలించి ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.

హసీనాను అప్పగించాలి.. బంగ్లాదేశ్ డిమాండ్

మరోవైపు షేక్ హసీనాను భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు అప్పగించాలని ఆ దేశ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమాయున్ కోబిర్ డిమాండ్ చేశారు. ఆమెకు కొత్త పాస్‌పోర్టు జారీ చేయడం కంటే, భారత్‌తో ఉన్న అప్పగింత ఒప్పందం ప్రకారం స్వదేశానికి రప్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

2024లో భారత్‌కు వచ్చిన హసీనా

2024 ఆగస్టులో బంగ్లాదేశ్‌లో విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచివచ్చారు. అప్పటి నుంచి ఆమె భారత్‌లోనే ఉంటున్నారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు కొనసాగిన ఆమె పాలనకు విద్యార్థి ఉద్యమం ముగింపు పలికింది.

ఇదిలా ఉండగా, డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లి కోర్టు ఎదుట లొంగిపోవాలని హసీనా భావిస్తున్నట్లు గతంలో ప్రకటించారు. అవసరమైన అధికారిక ప్రక్రియలు పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణ తేదీని వెల్లడిస్తారని ఆమె సహాయకులు తెలిపారు.

అయితే కొత్త పాస్‌పోర్టు, గుర్తింపు కార్డు కోసం చేసిన విజ్ఞప్తిపై బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన రాలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో హసీనా స్వదేశానికి తిరిగి వెళ్లే అంశం ఆసక్తికరంగా మారింది.