రెండో రోజు ఖజానా పంపిణీ.. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి పోటెత్తిన భక్తులు

రెండో రోజు ఖజానా పంపిణీ.. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి పోటెత్తిన భక్తులు

హైదరాబాద్: చార్మినార్‌లోని శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద భక్తుల రద్దీ కొనసాగుతోంది. అమ్మవారి ఖజానా నాణేల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కావడంతో నగరంలోని పలు  ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు.

నవంబర్ 8న  సాయంత్రం 7 గంటలకు ఆలయంలో ఖజానా నాణేల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ విషయం తెలియడంతో రాత్రి నుంచి భక్తుల సంఖ్య క్రమంగా పెరిగింది. అమ్మవారి నాణేలను పొందేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటున్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ పరిసరాల్లో దాదాపు నాలుగు క్యూ లైన్లను ఏర్పాటు చేసి నాణేల పంపిణీ చేపడుతున్నారు. అయినప్పటికీ భక్తుల రాక భారీగా ఉండటంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. గుల్జార్ హౌస్ వరకు సుమారు 500 మీటర్ల మేర భక్తులు బారులు తీరారు.

మరోవైపు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడటంతో వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు.అమ్మవారి ఖజానా నాణెం లభిస్తే సకల శుభాలు, సిరిసంపదలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ నమ్మకంతోనే నాణేలను సొంతం చేసుకునేందుకు నగర నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు.

మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ ఖజానా నాణేల పంపిణీ కార్యక్రమం ఈ నెల 11వ తేదీ వరకు కొనసాగనుంది. దీంతో రానున్న రోజుల్లోనూ ఆలయం వద్ద భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది.