దీపావళి ఎఫెక్ట్: ఢిల్లీలో డేంజర్ బెల్స్.. అత్యంత ప్రమాదకర స్థాయికి ఎయిర్ క్వాలిటీ

దీపావళి ఎఫెక్ట్: ఢిల్లీలో డేంజర్ బెల్స్.. అత్యంత ప్రమాదకర స్థాయికి ఎయిర్ క్వాలిటీ

మూలిగే నక్కమీద తాటి కాయ పడ్డట్లు ఉంది ఢిల్లీ పరిస్థితి. దేశంలోనే అత్యంత కాలుష్య నగరంగా చెప్పుకునే రాజధాని నగరం.. దీపావళి పండగ తర్వాత ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) దారుణంగా పడిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిలలాడే రాజధాని ప్రజలు.. దీపావళి కాలుష్యంతో ఊపిరి పీల్చుకోలేని పరిస్థితిలోకి వెళ్లిపోయారు. 

దీపావళి పండుగ తర్వాతి రోజు సోమవారం (2026 నవంబర్ 9)న ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ  తీవ్రంగా క్షీణించింది. ఉదయం 6 గంటలకు సిటీ మొత్తం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 366గా నమోదు కావడం భయాందోళనకు గురిచేస్తోంది. వాతావరణ కేంద్రం వెరీ పూర్ (చాలా దారుణం ) జాబితాలో చేర్చింది. మరోవైపు  15 మానిటరింగ్ స్టేషన్లలో AQI 400 పైన నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం. 

అర్థరాత్రి నుంచి సిటీలో దట్టమైన పొగమంచు (స్మాగ్) కమ్ముకుంది. దీంతో దగ్గరున్న వస్తువులను కూడా చూడలేని పరిస్థితి ఏర్పడింది.  భారత వాతావరణ శాఖ (IMD) ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో  చాలా దట్టమైన పొగమంచు ఉంటుందని హెచ్చరిక జారీ చేసింది. ఆగ్నేయ ఢిల్లీ (సౌత్ ఈస్ట్), తూర్పు ఢిల్లీ, షాహద్రా, ఉత్తర, దక్షిణ, మధ్య ఢిల్లీ ప్రాంతాల్లో పరిసరాలు కనిపించకుండా (దృశ్య తీవ్రత) తగ్గే అవకాశం ఉందని హెచ్చరించింది.

అత్యధిక కాలుష్యం నమోదైన ప్రాంతాలు:  

  • సోనియా విహార్: 449  
  • బురారి క్రాసింగ్: 445  
  • వివేక్ విహార్: 441  
  • జహంగీర్పురి: 439  
  • ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్: 437  
  • రోహిణి: 435  
  • డీటీయూ: 431  
  • బవానా: 424  
  • చాందినీ చౌక్, పట్పర్‌గంజ్: 418  
  • ముండ్కా: 413  
  • ఎన్‌ఐహెచ్ నరేలా, పంజాబీ బాగ్: 408  
  • ఐటీఓ, కామన్వెల్త్ స్పోర్ట్స్ కాంప్లెక్స్: 404  

ఈ క్రమంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) స్టేజ్-3 అమలులో కొనసాగుతోంది.

బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు:

కాలుష్య సమస్యపై రాష్ట్రీయ జనతా దళ్ (RJD) ఎంపీ మనోజ్ ఝా కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలను ప్రశ్నించారు. ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వం కావాలని అనుకున్నారు.. ఇదిగో వచ్చింది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాను కూడా ప్రశ్నించాలి. ఢిల్లీ సీఎంపై మాత్రమే నింద వేయడమే కాదు.. ప్రధాని, హోంమంత్రిలు కూడా బాధ్యులు అని  అన్నారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టలు కూడా విమర్శలకు దిగాయి. ఏడాది పొడవునా కాలుష్య నివారణకు చర్యలు తీసుకోకపోవడం, దీపావళికి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం పై విమర్శలు గుప్పించారు. వాతావరణం మారిన తర్వాత ఈ సమస్యను మర్చిపోతారని, మళ్లీ అక్టోబర్-నవంబర్‌లో అదే ప్రశ్నలు వస్తాయని హెచ్చరించారు.

విపక్షాలపై ఎదురు దాడికి దిగారు  ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై దాడి చేశారు. కాలుష్యం పేరుతో దీపావళి, సనాతన ధర్మంపై దాడి చేసే ప్రచారం  నడుస్తోందని ఆరోపించారు. మరో వైపు ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రజలు ఈ కాలుష్య పరిస్థితులపై జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.