ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీకొని ఏడుగురు మృతి, 100 మందికి పైగా గాయాలు

ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీకొని ఏడుగురు మృతి, 100 మందికి పైగా గాయాలు

కైరో: ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని కైరోకు దక్షిణంగా ఆదివారం రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. మృతుల్లో రైలు కండక్టర్ కూడా ఉన్నట్లు చీఫ్ ప్రాసిక్యూటర్ కార్యాలయం వెల్లడించింది.

గిజా ప్రావిన్స్‌లోని అల్-అయ్యత్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. కైరోకు సుమారు 52 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. రవాణా శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫయ్యూమ్ ప్రావిన్స్ వైపు వెళ్తున్న రైలు, దక్షిణ ప్రావిన్స్ అస్వాన్‌కు వెళ్తున్న మరో రైలును వెనుక నుంచి ఢీకొట్టింది. ఒకే ట్రాక్‌పై ఒకే దిశలో వెళ్తున్న ఈ రైళ్లలో ముందున్న రైలు నిలిచిపోయి ఉండటంతో వెనుక నుంచి వచ్చిన రైలు చివరి బోగీని బలంగా ఢీకొట్టినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి అంబులెన్స్‌లకు సమాచారం అందించారు. సుమారు 80 మంది క్షతగాత్రులను అంబులెన్స్‌ల ద్వారా సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు స్థానికుడు అయ్మాన్ గమాల్ తెలిపారు. నిలిచిపోయిన రైలులోని ఓ బోగీలో కొందరు ప్రయాణికులు చిక్కుకుపోయారని, వారిని బయటకు తీసే సమయానికి కొందరు మరణించినట్లు  చెప్పారు.

ప్రమాదంపై ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి స్పందించారు. ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చీఫ్ ప్రాసిక్యూటర్ కార్యాలయానికి చెందిన దర్యాప్తు అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

ఈజిప్టులో రైలు ప్రమాదాలు తరచూ జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రైల్వే వ్యవస్థలో నిర్వహణ లోపాలు, పరికరాల సక్రమ నిర్వహణ లేకపోవడం వంటి సమస్యలు ప్రమాదాలకు కారణమవుతున్నాయని గతంలో విమర్శలు వచ్చాయి. రైల్వే వ్యవస్థ ఆధునికీకరణకు ప్రభుత్వం పలు చర్యలు ప్రకటించినప్పటికీ ప్రమాదాలు కొనసాగుతున్నాయి.

గత ఏడాది సెప్టెంబర్‌లోనూ ఇదే అల్-అయ్యత్ జిల్లాలో రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్న ఘటనలో లోకో పైలట్, ఆయన సహాయకుడు గాయపడ్డారు. ఇక ఈజిప్టు చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం 2002లో జరిగింది. కైరో నుంచి దక్షిణ ఈజిప్టుకు వెళ్తున్న రాత్రి రైలులో మంటలు చెలరేగడంతో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.