దీపావళి టపాసుల ఎఫెక్ట్.. సరోజినీదేవి ఆసుపత్రికి కంటి బాధితుల క్యూ

దీపావళి టపాసుల ఎఫెక్ట్.. సరోజినీదేవి ఆసుపత్రికి కంటి బాధితుల క్యూ

హైదరాబాద్‌: దీపావళి పండుగ వేళ టపాసులు కాల్చుతూ పలువురు కంటి గాయాల బారిన పడుతున్నారు. బాణసంచా పేలుళ్ల కారణంగా కళ్లకు గాయాలైన బాధితులు ఒక్కొక్కరిగా హైదరాబాద్‌లోని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. దీంతో ఆసుపత్రిలో బాధితుల సంఖ్య పెరుగుతోంది.

ఇప్పటివరకు 60 మంది బాధితులు ఔట్ పేషెంట్లుగా ఆసుపత్రికి వచ్చినట్లు సమాచారం. వీరిలో 12 మందిని ఇన్‌పేషెంట్లుగా చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. గాయాల తీవ్రతను బట్టి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి తీవ్రంగా ఉండగా, మరికొందరికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది.గత ఏడాది దీపావళి సందర్భంగా వారం రోజుల వ్యవధిలో 116 మంది కంటి గాయాల బాధితులు ఆసుపత్రికి వచ్చారు. అయితే ఈసారి ఇప్పటికే 82 మంది బాధితులు ఆసుపత్రిని ఆశ్రయించడం ఆందోళన కలిగిస్తోంది.

టపాసులు కాల్చే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, అప్రమత్తంగా వ్యవహరించకపోవడం వల్లే కంటి గాయాలు ఎక్కువగా నమోదవుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా బాణసంచా పేలే సమయంలో వెలువడే నిప్పురవ్వలు నేరుగా కళ్లపై పడటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

దీపావళి వేడుకల సమయంలో బాణసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని, పిల్లలను పెద్దల పర్యవేక్షణలోనే టపాసులు కాల్చనివ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. కంటికి ఏదైనా గాయం అయితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కంటి వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.