బాక్సాఫీస్ వద్ద రామాయణ ప్రభంజనం.. నాలుగు రోజుల్లో రూ.500 కోట్ల క్లబ్‌లోకి.!

బాక్సాఫీస్ వద్ద రామాయణ ప్రభంజనం.. నాలుగు రోజుల్లో రూ.500 కోట్ల క్లబ్‌లోకి.!

ముంబై: బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కించిన భారీ చిత్రం రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. దీపావళి పండుగ సందర్భంగా ఆదివారం ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. ఒక్కరోజే భారత్‌లో రూ.56.15 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల వసూళ్ల మార్కుకు చేరువైంది.

దీపావళికి మూడు రోజుల ముందే విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే ప్రీ-ఫెస్టివల్ రిలీజ్‌గా రికార్డు సృష్టించింది. అయితే దీపావళి రోజున సినిమా వసూళ్లు మరింత పెరుగుతాయని చిత్ర బృందం ఆశించింది. అంచనాలకు తగ్గట్టుగానే ఆదివారం భారీ కలెక్షన్లు సాధించింది. ఇటీవలి సంవత్సరాల్లో బాలీవుడ్ చిత్రాల్లో దీపావళి రోజున అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.

ట్రేడ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ సాక్నిల్క్ గణాంకాల ప్రకారం.. ఈ సినిమా నాలుగు రోజుల్లో భారత్‌లో రూ.238.85 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. దీంతో ప్రభాస్ నటించిన ఆదిపురుష్’ తొలి నాలుగు రోజుల్లో సాధించిన రూ.237 కోట్ల నెట్ కలెక్షన్లను అధిగమించింది. ప్రస్తుతం ఈ సినిమా దేశీయ గ్రాస్ వసూళ్లు రూ.285.20 కోట్లకు చేరాయి.

విదేశాల్లోనూ ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. ఓవర్సీస్‌లో రూ.214 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్లు రూ.499.20 కోట్లకు చేరుకున్నాయి. దీంతో విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్ల మైలురాయికి చేరువైంది.

టైగర్ 3 రికార్డు బద్దలు

దీపావళి రోజు వసూళ్ల విషయంలోనూ ‘రామాయణ’ సరికొత్త రికార్డు సృష్టించింది. సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 2023లో దీపావళి రోజున రూ.44.50 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. 2024లో రోహిత్ శెట్టి తెరకెక్కించిన సింగం ఎగైన్ రూ.43.50 కోట్లు రాబట్టింది. గత ఏడాది ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘థామా’ రూ.24 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ రికార్డులన్నింటినీ అధిగమిస్తూ రామాయణ ఒక్కరోజే రూ.56.15 కోట్లు వసూలు చేసింది.

ఈ సినిమాలో రావణుడి పాత్రలో యష్ నటించినప్పటికీ కన్నడ వెర్షన్‌కు ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల స్పందన లభించడం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తొలి రోజు రూ.7.50 కోట్లతో ప్రారంభమైన కన్నడ వెర్షన్ ఆ తర్వాత వసూళ్లలో పెద్దగా పుంజుకోలేకపోయింది. మరోవైపు తెలుగు వెర్షన్ మెరుగైన వసూళ్లు సాధిస్తుండగా, తమిళ, మలయాళ వెర్షన్ల వాటా మాత్రం తక్కువగానే ఉంది.

మొత్తానికి దీపావళి పండుగను క్యాష్ చేసుకున్న ‘రామాయణ’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయ దిశగా దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల మార్కును దాటేందుకు అడుగు దూరంలో నిలిచింది.