శ్రీశైలంలో ఘోర ప్రమాదం జరిగింది. మహారాష్ట్రకు చెందిన ట్రావెల్స్ బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో బీభత్సం సృష్టించింది. సోమవారం ( నవంబర్ 9 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... మహారాష్ట్రకు చెందిన భక్తులు ప్రయాణిస్తున్న టూరిస్ట్ బస్సు బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో అదుపుతప్పి ఐదు కార్లను ఢీకొట్టింది. శ్రీశైలంలోని అలంకేశ్వరస్వామి ఆలయం క్లోజింగ్ గేట్ దగ్గర జరిగింది ఈ ప్రమాదం.
ఈ ఘటనలో ఐదు కార్లు ధ్వంసం అవ్వగా.. ఓ కారులోని బాలికకు స్వల్ప గాయాలయ్యాయి. ఐదు కార్లను ఢీకొట్టిన బస్సు పక్కనే ఉన్న గేట్ తగిలి ఆగిపోయింది. ఈ ఘటనలో ప్రాణనష్టమేమీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు,దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పార్క్ చేసిన కార్లలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు. బ్రేక్ ఫెయిల్ అవ్వడమే ప్రమాదానికి కారణమా లేక బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమా అన్నది తెలియాల్సి ఉంది.
