హైవేపై కారులో మంటలు..చిన్నారితో సహా  ఆరుగురు సజీవ దహనం

హైవేపై  కారులో మంటలు..చిన్నారితో సహా  ఆరుగురు సజీవ దహనం

ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముజఫర్‌నగర్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒక చిన్నారితో సహా ఆరుగురు సజీవ దహనమయ్యారు. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ లైట్ పోల్‌ను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం.. పానిపట్-ఖతిమా జాతీయ రహదారిపై జగహేరి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న లైట్ పోల్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. మంటలు వేగంగా వ్యాపించడంతో కారులో ఉన్నవారికి బయటపడే అవకాశం లేకుండా పోయింది.

కాలిపోయిన స్థితిలో ఆరుగురి మృతదేహాలు

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నికి పూర్తిగా కాలిపోయిన కారులో నుంచి ఆరుగురి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో కారు డ్రైవర్‌తో పాటు 10 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న బాలుడు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రమాదంలో మృతి చెందిన వారంతా హర్యానాలోని జింద్ జిల్లా నివాసులుగా తెలుస్తోంది. అయితే మృతుల పూర్తి వివరాలు, గుర్తింపును నిర్ధారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు చర్యలు చేపట్టారు. కారు ఏ కారణంతో అదుపుతప్పింది? లైట్ పోల్‌ను ఢీకొన్న తర్వాత మంటలు ఎలా చెలరేగాయి? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.