వచ్చే ఏడాది అంటే 2027 జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త చెక్‌బుక్స్ రాబోతున్నాయని, ప్రస్తుతం వాడుతున్న పాత చెక్‌బుక్స్ ఇక పనిచేయవని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. అయితే కొత్త చెక్బుక్లో ఇంకా ఎక్కువ సేఫ్టీ ఫీచర్లు ఉంటాయని, అందుకే ప్రతి ఒక్కరూ పాత చెక్‌బుక్‌లను మార్చుకోవాల్సి ఉంటుందని కొన్ని మెసేజెస్ వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ వార్తల్లో నిజం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం పూర్తిగా తప్పుదారి పట్టించేదని వెల్లడించింది.
ఆర్బీఐ ఏం చెప్పిందంటే ?
ప్రస్తుతం దేశంలోని బ్యాంకులు ఉపయోగిస్తున్న చెక్‌బుక్‌లు CTS (Cheque Truncation System) విధానంలో భాగంగా ఉన్నాయి. ఈ చెక్‌ల విషయంలో కొత్తగా ఎలాంటి మార్పులు చేయలేదని ఆర్బీఐ స్పష్టం చేసింది.
అంటే 2027 జనవరి 1 నుంచి కొత్త చెక్‌బుక్‌లు తప్పనిసరిగా తీసుకోవాలనే ఎలాంటి రూల్ ఆర్బీఐ ప్రకటించలేదు. అలాగే 2026 డిసెంబర్ 31 తర్వాత పాత చెక్‌బుక్‌లు చెల్లవని కూడా ఎలాంటి ఆర్డర్స్ జారీ చేయలేదు.
పాత చెక్‌బుక్‌ల పరిస్థితి ఏంటి?
ప్రస్తుతం మీరు మీ బ్యాంకు ఇచ్చిన చెక్‌బుక్‌ను ఉపయోగిస్తున్నట్లయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2026 డిసెంబర్ 31 తర్వాత మీ చెక్‌బుక్ పనిచేయదని భయపడాల్సిన పనిలేదు.
ఆర్బీఐ వెల్లడించిన సమాచారం ప్రకారం, ప్రస్తుతం అమల్లో ఉన్న CTS చెక్‌బుక్‌లను మార్చే ఉద్దేశం లేదు. కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మి కొత్త చెక్‌బుక్‌ల కోసం బ్యాంకులకు వెళ్లాల్సిన పని లేదు.
సోషల్ మీడియాలో ప్రచారం
X సహా ఇతర సోషల్ మీడియాలో మెసేజ్ వైరల్ అవుతోంది. అందులో 2026 డిసెంబర్ 31తో పాత చెక్‌బుక్‌ల గడువు ముగుస్తుందని, 2027 జనవరి 1 నుంచి కొత్త సేఫ్టీ ప్రమాణాలతో కూడిన చెక్‌బుక్‌లు అమల్లోకి వస్తాయని ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం ఆర్బీఐ దృష్టికి వెళ్లడంతో రిజర్వ్ బ్యాంకు స్పందించింది. అలాంటి కొత్త నిబంధనలేవీ ప్రకటించలేదని, ప్రస్తుతం CTS చెక్‌బుక్‌లకు సంబంధించి ఎలాంటి మార్పులు చేయడం లేదని స్పష్టం చేసింది.
ప్రజలు ఏం చేయాలి?
బ్యాంకింగ్ నిబంధనలకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను నమ్మకూడదు. ముఖ్యంగా చెక్‌బుక్‌లు, బ్యాంకు అకౌంట్స్, క్యాష్ ట్రాన్సక్షన్స్ సంబంధించిన విషయాల్లో అధికారిక సమాచారం తెలుసుకోవాలి.
ఏదైనా కొత్త నిబంధన అమల్లోకి వస్తే ఆర్బీఐ లేదా సంబంధిత బ్యాంకులు అధికారికంగా సమాచారం అందిస్తాయి. కాబట్టి గుర్తుతెలియని వ్యక్తులు పంపించే మెసేజ్‌లు, వాట్సాప్ ఫార్వర్డ్లను చూసి భయపడాల్సిన అవసరం లేదు.
మొత్తంగా చెప్పాలంటే 2027 జనవరి 1 నుంచి కొత్త చెక్‌బుక్‌లు తప్పనిసరి అనే వార్తలో నిజం లేదు. ప్రస్తుతం వాడుతున్న CTS చెక్‌బుక్‌లను మార్చాల్సిన అవసరం కూడా లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మకుండా ఆర్బీఐ అధికారిక సమాచారాన్నే పాటించాలని సూచించింది.
