ఈ ఆలోచన రోజుకు కనీసం ఒక్కసారైనా పెగ్గు వేసే మందు ప్రియులకు గానీ.. సరదాగా కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తాగే వారికి గానీ వచ్చిఉండదు. డ్రింక్స్ లో కొన్నింటికి గాజు సీసాలు, మరికొన్నింటికి అల్యూమినియం క్యాన్లు ఎందుకు వాడతారో తెలిసి ఉండదు. ముఖ్యంగా బీర్, కోలా వంటి డ్రింక్స్ కు క్యాన్లలో, వైన్ విస్కీ లాంటి డ్రింక్స్ బాటిళ్లలో అమ్ముతుంటారు. వీటి వెనుక ఏదైనా సైన్స్ ఉందా లేదా సంప్రదాయకంగా వాడుతున్నారా అనేది ఓసారి డిస్కస్ చేద్దాం.
పార్టీలకు వెళ్లేటప్పుడు బీర్లను బాటిల్స్ లో తీసుకెళ్లే కంటే క్యాన్‌లు తీసుకెళ్లడం సులభం. అవి తేలికగా ఉంటాయి, పగిలే ప్రమాదం తక్కువ. కానీ వైన్ లేదా విస్కీ బాటిళ్లు మాత్రం జాగ్రత్తగా తీసుకెళ్లాలి. ఈ ప్యాకేజింగ్ కేవలం సౌకర్యం కోసం మాత్రమే కాదు. దాని వెనుక సైన్స్, రుచి కాపాడుకోవడంతో పాటు చారిత్రక అంశాలు కూడా కూడా ఉన్నాయి.
బీర్, కోలా క్యాన్‌ల్లో ఎందుకు?
బీర్, కోలాలో కార్బన్ డయాక్సైడ్ వాయువు కరిగి ఉంటుంది. అందువల్లనే అవి ఫిజ్జీగా ఉంటాయి. ఈ ఫిజ్‌ను కాపాడాలంటే ప్యాకేజింగ్ లోపలి ఒత్తిడిని తట్టుకోవాలి. అల్యూమినియం క్యాన్‌లు ఈ పనిని బాగా చేస్తాయి.
బీర్‌కు కాంతి తగిలితే రుచి పాడైపోతుంది. స్కంకీ వాసన వస్తుంది. అల్యూమినియం క్యాన్‌లు కాంతిని పూర్తిగా నిరోధిస్తాయి. గాజు బాటిళ్లు కూడా వాడవచ్చు కానీ అవి గోధుమ రంగు లేదా టింటెడ్‌గా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
క్యాన్‌లు తేలికగా ఉంటాయి, త్వరగా చల్లబడతాయి, పగిలే ప్రమాదం తక్కువ. 1935లో అమెరికాలో మొదటిసారి క్యాన్‌డ్ బీర్ వచ్చింది. మొదట్లో మెటల్ రుచి వచ్చేది. తర్వాత లోపలి లైనింగ్ వేసి సమస్యను పరిష్కరించారు. అప్పటి నుంచి క్యాన్‌లు పాపులర్ అయ్యాయి.
వైన్ గాజు బాటిళ్లలో ఎందుకు?
వైన్ సెన్సిటివ్ డ్రింక్. అంటే సున్నితమైన పానీయం. కొన్ని వైన్‌లు ఎన్ని ఏండ్లు ఉంటే అంత రుచి పెంచుకుంటాయి. గాజు రసాయనికంగా స్థిరంగా ఉంటుంది. అంటే అందులో ఉండే కెమికల్ కంపౌండ్స్ లోపలి ద్రవంతో రియాక్ట్ అవ్వదు. ఆక్సిజన్, ఇతర వాయువుల నుంచి బాగా రక్షిస్తుంది. అందుకే గాజు బాటిల్స్ లో వాడతారు.
ఆక్సిజన్ ఎక్కువైతే వైన్ రుచి, రంగు, వాసన మారిపోతాయి. ఆక్సిజన్ నుంచి రియాక్షన్ పొందకుండా చూసేందుకు గాజు బాటిల్ ఉపయోగపడుతుంది. కార్క్ లేదా స్క్రూ క్యాప్‌తో కలిపి గాజు బాటిల్ వైన్‌ను బాగా కాపాడుతుంది. బాటిల్ తెరిచి పోయడం కూడా ఒక ప్రత్యేక అనుభవం అని చెబుతున్నారు.
విస్కీ బాటిళ్లలో ఎందుకు?
విస్కీని మొదట్లో చెక్క బారెల్‌ల్లో దాచి ఉంచేవారు. అలా నిల్వ ఉంచే కొలది అది రుచిని మార్చుకుంటూ ఉంటుంది. పాతబడి పోతుంది. బాటిల్‌లో పోసిన తర్వాత ఆ ప్రక్రియ ఆగిపోతుంది. బాటిల్ పని కేవలం రుచిని యథాతథంగా ఉంచడమే. గాజు బాటిల్ ఏ రుచినీ కలపదు, ఉన్న రుచుని పోనివ్వదు. ఆక్సిజన్ వంటి వాయువుల నుంచి రక్షిస్తుంది.
క్యాన్‌ల్లో కూడా విస్కీ కాక్‌టెయిల్స్ అమ్ముతున్నారు. కానీ ప్రీమియం విస్కీకి గాజు బాటిల్ హెరిటేజ్, క్వాలిటీని సూచిస్తుందని చెబుతున్నారు.
ఇప్పుడు అన్నీ కలిపే వాడుతున్నారు.. కానీ
కోలాను క్యాన్లలో వాడటం మొదటి నుంచి ఉంది. అయితే ఇప్పుడు కోకా-కోలా గాజు బాటిల్‌లో కూడా అమ్ముతున్నారు. బాటిల్ లో తాగితే మరింత రుచిగా అనిపిస్తుందని చాలామంది చెబుతారు. వైన్, విస్కీ కూడా కొన్నిసార్లు వేరే ప్యాకేజింగ్‌లో వస్తున్నాయి. అయినా సంప్రదాయ గాజు బాటిళ్లే ఇప్పటికీ ప్రీమియం పానీయాలకు ఉపయోగించడం జరుగుతుంది. .
