ఉమ్మడి కరీంనగర్ జిల్లాను ఉత్తర తెలంగాణలో అగ్రస్థానంలో నిలుపుతాం: పొన్నం ప్రభాకర్

ఉమ్మడి కరీంనగర్ జిల్లాను ఉత్తర తెలంగాణలో అగ్రస్థానంలో నిలుపుతాం: పొన్నం ప్రభాకర్

కరీంనగర్: నగర అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాను ఉత్తర తెలంగాణలో అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తర్వాత జిల్లా అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.

కరీంనగర్‌లో రూ.4 కోట్లతో చేపట్టనున్న అర్బన్ డెవలప్‌మెంట్ పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, నగర మేయర్ శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి విషయంలో పోటీపడి పనిచేస్తున్నామని, విద్యా, వైద్య రంగాల్లోనూ జిల్లాను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఉమ్మడి జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అర్బన్ డెవలప్‌మెంట్ కోసం ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు మంజూరు చేసిందని, నగరాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు. కేవలం తాత్కాలిక ప్రయోజనాల కోసం కాకుండా, దీర్ఘకాలికంగా ప్రజలకు ఉపయోగపడే స్థిరమైన అభివృద్ధి పనులను చేపడుతున్నామని పేర్కొన్నారు.

మానేరు డంపింగ్ యార్డు తొలగింపునకు ప్రాధాన్యత

మానేరు రివర్ ఫ్రంట్‌కు సంబంధించి విచారణతో పాటు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. మానేరు తీరంలో ఉన్న డంపింగ్ యార్డును తప్పనిసరిగా తొలగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రజల నివాస ప్రాంతాలకు దూరంగా డంపింగ్ యార్డును ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ సమస్యను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

ALSO READ : రెండో రోజు ఖజానా పంపిణీ.. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి పోటెత్తిన భక్తులు

రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం, జిల్లా అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్నామని, ఉత్తర తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో నిలపడమే తమ లక్ష్యమని మంత్రి  తెలిపారు