ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రాష్ట్రవ్యాప్తంగా  86 బస్ స్టేషన్లు మోడల్‌గా అభివృద్ధి.. 

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రాష్ట్రవ్యాప్తంగా  86 బస్ స్టేషన్లు మోడల్‌గా అభివృద్ధి.. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 86 ప్రధాన బస్ స్టేషన్లను మోడల్ బస్ స్టేషన్లుగా అభివృద్ధి చేయాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. రోజుకు 5 వేల మందికి పైగా ప్రయాణికుల రాకపోకలు ఉండే బస్ స్టేషన్లను ఇందుకోసం గుర్తించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, ప్రజా రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించడమే లక్ష్యంగా సంస్థ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది.

ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 86 ప్రధాన బస్ స్టేషన్లలో ప్రత్యేక కంట్రోలర్లను నియమించనున్నారు. ప్రయాణికులకు అవసరమైన సమాచారం అందించేందుకు ప్రత్యేక ఎంక్వైరీ సదుపాయాలతో పాటు సంప్రదింపు నంబర్లను ఏర్పాటు చేయనున్నారు. అన్ని బస్ స్టేషన్లలో కొత్త టైమ్‌టేబుల్ బోర్డులను అందుబాటులోకి తీసుకురానున్నారు.

అలాగే మొదటి, చివరి బస్సుల రాకపోకల సమయాలను పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ప్రయాణికులకు తెలియజేయనున్నారు. బస్ స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. దీంతో ప్రయాణికులు బస్సుల వివరాలను సులభంగా తెలుసుకోవడంతో పాటు, వేచి ఉండే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గనున్నాయి.

బస్ స్టేషన్లలో సీసీటీవీ నిఘా

ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు టీజీఎస్ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. ఈ కెమెరాలను ప్రాంతీయ కార్యాలయాలతో పాటు సంస్థ ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేయనున్నారు. తద్వారా బస్ స్టేషన్లలో జరుగుతున్న కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు, బస్ స్టేషన్ల నిర్వహణను మెరుగుపరచేందుకు ఈ చర్యలు దోహదపడనున్నాయి.

మెరుగైన ప్రజా రవాణా సేవలే లక్ష్యం

ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రజా రవాణా సేవలు అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి వెల్లడించారు. బస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాల మెరుగుదల, సమాచార వ్యవస్థ బలోపేతం, భద్రతా చర్యల అమలుతో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి.