సాహిత్యంలో ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక అవార్డు అయిన బుకర్ ప్రైజ్ 2026కు గాను ది ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనే నవలకు వచ్చింది. బ్రిటిష్ రచయిత ఎం. జాన్ హ్యారిసన్ రాసిన ఈ నవల బుకర్ ప్రైజ్ గెలుచుకుంది. 2026 నవంబర్ 9 ( సోమవారం) రాత్రి లండన్‌లోని ఓల్డ్ బిల్లింగ్స్‌గేట్‌లో జరిగిన వేడుకలో ఈ ప్రకటన చేశారు.
రచయిత హ్యారిసన్ 81 ఏళ్ల వయసులో బుకర్ ప్రైజ్ గెలిచి.. ఈ అవార్డు అందుకున్న అతిపెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించారు. గతంలో 2019లో 79 ఏళ్ల వయసులో మార్గరెట్ అట్‌వుడ్ ఈ రికార్డు సొంతం చేసుకున్నారు. 60 సంవత్సరాల రచనా జీవితం గడిపిన హ్యారిసన్‌కు ఇది మొదటి బుకర్ నామినేషన్, మొదటి విజయం.
నవలలో ఏముంది..?
ది ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ కేవలం 198 పేజీలు ఉండి, ఈ ఏడాది షార్ట్‌లిస్ట్‌లోకి వచ్చిన అతి చిన్న నవల. ఈ కథ భవిష్యత్తులో ఇంగ్లాండ్‌లోని కెంట్ తీర ప్రాంతంలో సాగుతుంది. ఒక వింతైన, అంతుచిక్కని విపత్తు సంభవించి బ్రిటీష్ సమాజం పూర్తిగా కుప్పకూలిపోతుంది. కొన్ని దశాబ్దాల తర్వాత ఈ కథ ప్రారంభమవుతుంది. అక్కడ ప్రభుత్వం అనేది నామమాత్రంగా కూడా పనిచేయదు, చట్టం, శాంతిభద్రతలు పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతాయి
దీనికి తోడు భూమిపైకి ఐగెట్టి అని పిలిచే వింతైన, ఆకారాలు మార్చే జీవులు దండయాత్ర చేస్తాయి. ఇవి ఎక్కడి నుండి వచ్చాయో, ఎందుకు వచ్చాయో ఎవరికీ తెలియదు. అవి మనుషుల మాటలను, అలవాట్లను అనుకరిస్తూ కంట్రోల్ లోకి తీసుకోవడం ప్రారంభిస్తాయి. ఇందులో కథా నాయకుడికి ఐగెట్టికి మధ్య జరిగిన ఘటనలు.. ఉనికి కాపాడుకునేందుకు చేసిన పోరాటం, వదిలించుకునేందుకు ఏం చేశారు..? అనే అంశాలపై కథ నడుస్తుంది.
బుకర్ జడ్జీలు ఏమన్నారంటే?
ఈ నవల కేవలం 198 పేజీల చిన్న పుస్తకం అయినప్పటికీ, చాలా లోతైన కథాంశాన్ని కలిగి ఉందని జడ్జీల ప్యానెల్ ఛైర్మన్ మేరీ బార్డ్ పేర్కొన్నారు. ప్రపంచం అంతమైపోతున్నా కూడా మనుషులు పిల్లల పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం, సముద్ర తీరంలో కాఫీ తాగడం వంటి సాధారణ పనులను గురించి అద్భుతంగా చూపించారని చెప్పారు. ఈ కథ పాఠకులను ఆలోచింపజేస్తూనే ఒక రకమైన ఆశావహ దృక్పథాన్ని కలిగిస్తుందని ప్రశంసించారు
బుకర్ ప్రైజ్ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గ్యాబీ వుడ్ మాట్లాడుతూ, హ్యారిసన్ బోనా ఫైడ్ సైన్స్ ఫిక్షన్ ప్రపంచం నుంచి వచ్చిన మొదటి బుకర్ విజేత అని అన్నారు. హ్యారిసన్ సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ లేబుల్స్‌ను ఇష్టపడనప్పటికీ, ఆయనను లిటరరీ సైన్స్ ఫిక్షన్ టైటాన్ గా పిలుస్తారని చెప్పారు. ఆయన 13 నవలలు, 5 చిన్న కథల సంకలనాలు, ఒక యాంటీ మెమోయిర్ రాశారు.
హ్యారిసన్ కు ఎంత నగదు వస్తుంది..?
హ్యారిసన్‌కు 50 వేల పౌండ్ల నగదు బహుమతి, ట్రోఫీ అందజేశారు. అంటే ఇండియన్ కరెన్సీలో 63 లక్షల 16 వేల రూపాయలకు సమానం. గత విజేత డేవిడ్ స్జాలే ఈ బహుమతిని అందజేశారు.
