ఎన్విడియా సీఈవో- చైనా స్పై వివాదం..భారత్ సొంత AI పై ప్రభావం చూపుతుందా?

ఎన్విడియా సీఈవో- చైనా స్పై వివాదం..భారత్ సొంత AI పై ప్రభావం చూపుతుందా?

ఎన్విడియా (Nvidia) సీఈవో జెన్సన్ హువాంగ్‌ చుట్టూ బిగుసుకున్న చైనా స్పై వివాదం భారత్ సొంతంగా నిర్మిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లక్ష్యాలపై ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ప్రభావం చూపే అవకాశం ఉందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదంతో అంతర్జాతీయ చిప్ సరఫరా నిబంధనలు మరింత కఠినతరం కావడంతో పాటు, భారత్ సొంతంగా ఏఐ సామర్థ్యాలను నిర్మించుకోవాల్సిన ఆవశ్యకత పెరుగుతుందంటున్నారు. 

సింగపూర్ కేంద్రంగా పనిచేసే డేటా సెంటర్ సంస్థ మెగాస్పీడ్ (Megaspeed) మాజీ ఎగ్జిక్యూటివ్ ఆలిస్ హువాంగ్‌తో తనకు వివాహేతర సంబంధం ఉన్నట్లు జెన్సన్ హువాంగ్ అంగీకరించారు. ఆమె చైనా నిఘా విభాగం కోసం పనిచేస్తున్న గూఢచారి అని అమెరికా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.  అమెరికా ఆంక్షలను తప్పించుకుని, ఆగ్నేయాసియా డేటా సెంటర్ల ద్వారా చైనా సంస్థలకు ఎన్విడియా ఏఐ చిప్‌లను మెగాస్పీడ్ చేరవేసిందనే ఆరోపణలపై ఇప్పటికే దర్యాప్తు జరుగుతోంది.  ఈ వ్యవహారంపై ఎన్విడియా బోర్డు స్వతంత్ర దర్యాప్తు ప్రారంభించగా, అమెరికా ఎఫ్‌బీఐ (FBI) ,కాంగ్రెస్ కూడా విచారణ జరుపుతున్నాయి. చైనా మాత్రం ఈ గూఢచర్య ఆరోపణలను పూర్తిగా ఖండించింది.

భారత్ ఏఐ లక్ష్యాలపై ప్రభావం ఎంత .. 

మన దేశ  సొంత AI అభివృద్ధి ఎన్విడియాతో ముడిపడి ఉంది. ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ నివేదికల ప్రకారం..భారత్ తన  ఇండియా ఏఐ మిషన్ (IndiaAI Mission) కింద వేల సంఖ్యలో జీపీయూ (GPU) చిప్‌లను ఎన్విడియానుంచి సమకూర్చుకుని ఏఐ మౌలిక సదుపాయాలను నిర్మించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వివాదంతో భారత్‌పై అనేక విధాలుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆగ్నేయాసియా దేశాల ద్వారా చిప్‌లు చైనాకు తరలిపోతున్నాయనే ఆందోళనతో, అమెరికా ప్రభుత్వం చిప్ ఎగుమతులపై నిఘా ,లైసెన్సింగ్ నిబంధనలను మరింత కఠినతరం చేసే అవకాశం ఉంది. దీంతో భారత డేటా సెంటర్లు, స్టార్టప్‌లకు ఎన్విడియా హార్డ్‌వేర్ అందడంలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. 

అయితే చైనాతో వ్యాపార లావాదేవీలు అమెరికాకు తీవ్ర భద్రతా ముప్పుగా మారుతున్న క్రమంలో ఎన్విడియా వంటి దిగ్గజ సంస్థలు తమ పెట్టుబడులు, సరఫరాలను నమ్మకమైన భాగస్వామి అయిన భారత్ వైపు మళ్లించేందుకు ఇది ఓ అవకాశంగా మారవచ్చు.

ఒకే విదేశీ కంపెనీ లేదా ఒకే దేశపు సాంకేతికతపై పూర్తిగా ఆధారపడటం వల్ల వచ్చే భౌగోళిక రాజకీయ ప్రమాదాలను ఈ వివాదం స్పష్టం చేస్తోంది. తాజా నిపుణుల విశ్లేషణ ప్రకారం, భారత్ సొంతంగా సెమీకండక్టర్ తయారీని ,స్వదేశీ ఏఐ మౌలిక సదుపాయాలను వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ వివాదం నొక్కి చెపుతోంది. 

ఈ వివాదం కారణంగా ఎన్విడియా షేర్లు పతనమై, కంపెనీ మార్కెట్ విలువలో భారీ క్షీణత నమోదైంది. అంతర్జాతీయ ఏఐ మార్కెట్లో ఇలాంటి అస్థిరత ఏర్పడితే, భారత ఏఐ స్టార్టప్‌లలోకి వచ్చే విదేశీ పెట్టుబడుల వేగంపై తాత్కాలిక ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.   ప్రస్తుతానికి ఎన్విడియా కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం లేదని సంస్థ బోర్డు స్పష్టం చేసినప్పటికీ, అమెరికా కాంగ్రెస్ విచారణలో వెలువడే అంశాలు రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ఏఐ చిప్ వాణిజ్య విధానాలను నిర్ణయించనున్నాయి.

మరిన్ని వార్తలు