రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆకలేస్తే చాలామంది ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారు. రైలు ఏ స్టేషన్‌కు వస్తుందో ముందుగానే తెలుసుకుని, ఆ స్టేషన్‌లోనే మనకు నచ్చిన ఆహారాన్ని సీటు దగ్గరికి తెప్పించుకుంటారు. అయితే ఇలా ఆహారం ఆర్డర్ చేసే సమయంలో ప్రయాణికులు చాలా జాగ్రత్తగా ఉండాలని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) హెచ్చరించింది. రైళ్లలో ఫుడ్ సప్లయ్ చేస్తున్న కొన్ని అనధికారిక వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌ల వల్ల ప్రయాణికుల ఆరోగ్యం, వ్యక్తిగత సమాచారం, డబ్బుకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
రైల్వే నెట్‌వర్క్ పరిధిలో ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా ఫుడ్ సప్లయ్ చేస్తున్న సంస్థలపై ఐఆర్‌సీటీసీ చర్యలు ప్రారంభించింది. అంతేకాకుండా, ఐఆర్‌సీటీసీ పేరును, సంస్థ గుర్తింపును ఉపయోగించుకుంటూ ప్రయాణికులను ఆకర్షిస్తున్న వారిపైనా కఠినంగా వ్యవహరిస్తోంది. అనుమతి లేకుండా ఇ-క్యాటరింగ్ సేవలు నిర్వహించే సంస్థలను గుర్తించి వాటి కార్యకలాపాలను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టింది.
అనధికారిక ఫుడ్ డెలివరీ వెబ్‌సైట్లతో ఏమవుతుంది?
ప్రస్తుతం రైలు ప్రయాణికులకు ఆన్‌లైన్‌లో ఫుడ్ అందించేందుకు చాల వెబ్‌సైట్లు, యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో అన్నీ రైల్వే శాఖ లేదా ఐఆర్‌సీటీసీ నుంచి అనుమతి పొందినవి కావు. కొన్ని సంస్థలు ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే రైళ్లలో ఫుడ్ సప్లయ్ చేస్తున్నాయి.
ఇలాంటి అనధికారిక సంస్థల ద్వారా ఫుడ్ ఆర్డర్ చేస్తే పలు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఐఆర్‌సీటీసీ చెబుతోంది. ముఖ్యంగా ఆహారాన్ని ఎక్కడ తయారు చేస్తున్నారు ? పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేస్తున్నారా ? నాణ్యమైన పదార్థాలు ఉపయోగిస్తున్నారా ? అనే విషయాలపై సరైన పర్యవేక్షణ ఉండకపోవచ్చు. దీంతో ప్రయాణికుల ఆరోగ్యానికి ఇబ్బందులు కలగవచ్చు.
అలాగే, ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసే సమయంలో ప్రయాణికులు వారి ఫోన్ నంబర్లు, ప్రయాణ వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని అందిస్తుంటారు. అనధికారిక యాప్‌లు లేదా వెబ్‌సైట్లలో ఈ వివరాలు ఎంతవరకు సురక్షితంగా ఉంటాయో చెప్పలేము. డబ్బులు కట్టిన తర్వాత ఫుడ్ అందకపోవడం, అదనపు ఛార్జీలు వసూలు చేయడం వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఈ కారణాలతోనే అనధికారిక ఫుడ్ డెలివరీ సంస్థలపై ఐఆర్‌సీటీసీ చర్యలు చేపట్టింది.
ALSO READ : కర్ణాటకలో ఇథనాల్ 20 శాతం దాటలేదు
ఈ వెబ్‌సైట్లతో జాగ్రత్త
రైల్వే ప్రయాణికులకు ఫుడ్ సప్లయ్ చేస్తున్న కొన్ని అనధికారిక ఇ-క్యాటరింగ్ సంస్థలను ఐఆర్‌సీటీసీ గుర్తించింది. వాటిలో RAILRESTRO.COM, RAILRESTRO.IN వంటి వెబ్‌సైట్లు కూడా ఉన్నాయని వెల్లడించింది. ఇలాంటి సంస్థలు అధికారిక అనుమతి లేకుండా సేవలు నిర్వహించడం లేదా ఐఆర్‌సీటీసీ పేరు, గుర్తింపును దుర్వినియోగం చేయడం వంటి ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అయితే, ప్రయాణికులు ఏదైనా వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసే ముందు అది ఐఆర్‌సీటీసీ నుంచి అధికారిక అనుమతి పొందిందో లేదో తప్పనిసరిగా తెలుసుకోవాలి.
రైలులో ఫుడ్ ఆర్డర్ చేయాలంటే ఏం చేయాలి?
రైలు ప్రయాణ సమయంలో ఫుడ్ కావాలనుకునే వారు కేవలం అధికారిక మార్గాలనే ఉపయోగించాలని ఐఆర్‌సీటీసీ సూచించింది. ఇందుకోసం ఈ క్రింది మార్గాల్లో ఆహారాన్ని బుక్ చేసుకోవచ్చు. అధికారిక ఐఆర్‌సీటీసీ ఇ-క్యాటరింగ్ వెబ్‌సైట్: ఐఆర్‌సీటీసీకి చెందిన అధికారిక ఇ-క్యాటరింగ్ వెబ్‌సైట్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేయవచ్చు. ఫుడ్ ఆన్ ట్రాక్ యాప్: ఐఆర్‌సీటీసీ అధికారిక మొబైల్ అప్లికేషన్ అయిన ‘ఫుడ్ ఆన్ ట్రాక్’ ద్వారా కూడా మనకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు.
అధికారికంగా అనుమతి పొందిన సంస్థలు: ఐఆర్‌సీటీసీ నుంచి అనుమతి పొందిన ఇ-క్యాటరింగ్ అగ్రిగేటర్లు, ఫుడ్ వెండర్స్ ద్వారా మాత్రమే ఆర్డర్ చేయాలి. ఈ మార్గాల్లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం వల్ల ఫుడ్ సప్లయ్ ప్రక్రియపై అధికారిక పర్యవేక్షణ ఉంటుంది. ప్రయాణికుల భద్రతకు కూడా ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది.
అనధికారిక ఫుడ్ డెలివరీ కనిపిస్తే ఏం చేయాలి?
రైలు ప్రయాణ సమయంలో ఎవరైనా అనధికారికంగా ఫుడ్ విక్రయిస్తున్నా, అనుమతి లేకుండా ఫుడ్ డెలివరీ చేస్తున్నా ప్రయాణికులు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని ఐఆర్‌సీటీసీ కోరింది. ఇలాంటి ఘటనలను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) దృష్టికి తీసుకెళ్లవచ్చు. ఇందుకోసం 182 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
మొత్తంగా చూస్తే, రైలు ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందించడంతో పాటు వారి ఆరోగ్యం, వ్యక్తిగత సమాచారం, డబ్బుకు భద్రత కల్పించడమే ఐఆర్‌సీటీసీ ఈ చర్యల ముఖ్య ఉద్దేశం. అందుకే రైలులో ఫుడ్ ఆర్డర్ చేసే ముందు వెబ్‌సైట్ లేదా యాప్ అధికారికమైనదో కాదో చెక్ చేసుకోవాలని ప్రయాణికులకు సూచిస్తోంది.
