భారత్ సమ్మిట్ కు రండి.. రాహుల్ కు పీసీసీ చీఫ్ ఆహ్వానం

భారత్ సమ్మిట్ కు రండి.. రాహుల్ కు పీసీసీ చీఫ్  ఆహ్వానం

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు.  నవంబర్ 12 నుంచి హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు జరగనున్న భారత్ సమ్మిట్‌కు రాహుల్ గాంధీని మహేశ్ కుమార్ గౌడ్ ఆహ్వానించారు. ఈ సమ్మిట్‌కు సంబంధించిన వివరాలను ఆయనకు వివరించారు.

తెలంగాణ రాజకీయాలపై చర్చ

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం, పార్టీ సంస్థాగత వ్యవహారాలు, పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి అంశాలు భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. అలాగే కులగణన అమలు, ఓబీసీలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.

నవంబర్ 12 నుంచి హైదరాబాద్‌లో  సమ్మిట్

హైదరాబాద్ వేదికగా నవంబర్ 12 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న భారత్ సమ్మిట్‌కు అంతర్జాతీయ స్థాయిలో ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 దేశాల నుంచి 450 మందికి పైగా ప్రతినిధులు, పలు రంగాలకు చెందిన నిపుణులు, పారిశ్రామిక దిగ్గజాలు, విదేశీ రాయబారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ALSO READ : పెళ్లిళ్లు, విడాకులపై వ్యక్తిగత విమర్శలు, కామెంట్స్ చేయొద్దు

భారత్ సాధిస్తున్న సాంకేతిక పురోగతి, ఆర్థిక వృద్ధి, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచ వేదికపై చాటిచెప్పడమే ఈ సమ్మిట్ ప్రధాన ఉద్దేశం. అంతర్జాతీయ ప్రతినిధుల భాగస్వామ్యంతో హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడంతో పాటు, భారత్‌లోని అభివృద్ధి అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా ఈ సదస్సు నిలవనుంది.