మేడ్చల్‌లో పోలీస్ స్టేషన్ పక్కనే  భారీ చోరీ.. గోడకు కన్నం వేసి మరీ. బంగారం షాపులో చొరబడ్డ దొంగలు

మేడ్చల్‌లో పోలీస్ స్టేషన్ పక్కనే  భారీ చోరీ.. గోడకు కన్నం వేసి మరీ. బంగారం షాపులో చొరబడ్డ దొంగలు

మేడ్చల్ జిల్లా: దొంగలు పోలీసులకే సవాల్ విసిరారు. ఏకంగా పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న బంగారు ఆభరణాల దుకాణంలో చోరీకి పాల్పడిన ఘటన మేడ్చల్‌లో కలకలం రేపింది. శ్రీ జగదాంబ జ్యువెలర్స్‌లోకి వెనుక గది గోడకు కన్నం వేసి చొరబడిన దుండగులు విలువైన వెండి ఆభరణాలు, ఇతర వస్తువులను అపహరించారు.

వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్‌లోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న శ్రీ జగదాంబ జ్యువెలర్స్ దుకాణాన్ని దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. దుకాణం వెనుక భాగంలోని గది గోడకు కన్నం వేసి లోపలికి ప్రవేశించారు. అనంతరం దుకాణంలో ఉన్న విలువైన వెండి ఆభరణాలు, ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారు.

ఉదయం దుకాణం తెరిచేందుకు వచ్చిన యజమాని శేషమాల్ చౌదరి కుమారుడు అజయ్ చౌదరి చోరీ జరిగిన విషయాన్ని గుర్తించాడు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో యజమాని శేషమాల్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న క్రైమ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చోరీ జరిగిన తీరును పరిశీలించి, అక్కడి నుంచి కీలక ఆధారాలను సేకరించారు. నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు.

ఇదిలా ఉండగా.. ఇదే జ్యువెలరీ దుకాణంలో గతంలోనూ చోరీ జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా రెండోసారి కూడా పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న దుకాణంలో దొంగతనం జరగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పోలీస్ స్టేషన్ సమీపంలోనే దుండగులు చోరీకి పాల్పడటంతో స్థానిక వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. నిందితులను త్వరగా గుర్తించి అరెస్ట్ చేయాలని వ్యాపారులు కోరుతున్నారు.