ఎన్నో రహస్యాలు నుంచి రాజకీయ జీవితం వరకు.. సోనియా గాంధీ ‘బిలాంగింగ్’ పేరుతో ఆత్మకథ పుస్తకం విడుదల!

ఎన్నో రహస్యాలు నుంచి రాజకీయ జీవితం వరకు.. సోనియా గాంధీ ‘బిలాంగింగ్’ పేరుతో ఆత్మకథ పుస్తకం విడుదల!

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) అధ్యక్షురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం ఈరోజు  (నవంబర్ 10) నుంచి దేశవ్యాప్తంగా ప్రముఖ బుక్ స్టోర్లలో అందుబాటులోకి రానుంది. ఉదయం 10 గంటల నుంచి ఈ పుస్తకాన్ని కొనుగోలు చేయవచ్చని ప్రచురణ సంస్థ హార్పర్‌కాలిన్స్ వెల్లడించింది. సోనియా గాంధీ జీవితానికి సంబంధించిన ఎన్నో  వ్యక్తిగత విషయాలు ఇందులో ఉండటంతో ఈ పుస్తకంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

ఈ పుస్తకంలో సోనియా గాంధీ తన బాల్యం నుంచి రాజకీయ జీవితంలోకి వచ్చిన తీరు వరకు చాల విషయాలను వివరించారు. ఇటలీలోని యుద్ధానంతర పరిస్థితుల్లో గడిపిన తన చిన్ననాటి రోజులు, ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్‌లో రాజీవ్ గాంధీతో పరిచయం, ఆ పరిచయం ప్రేమగా మారడం, ఆ తర్వాత ఇద్దరూ వివాహం చేసుకోవడం వంటి విషయాలను తన అనుభవాల ఆధారంగా రాశారు.

అంతేకాకుండా, తన జీవితంలో ఎదురైన అత్యంత కష్టమైన సంఘటనలను కూడా ఈ ఆత్మకథలో ప్రస్తావించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య, ఆ తర్వాత తన భర్త రాజీవ్ గాంధీ హత్య తన జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేశాయో వివరించారు. ఈ రెండు ఘటనల తర్వాత ఆమె  ఎదుర్కొన్న బాధలు, మానసిక సంఘర్షణలు, వాటి నుంచి బయటపడి జీవితాన్ని తిరిగి ఎలా కొనసాగించారనే విషయాలను పంచుకున్నారు. ఇటలీలో పుట్టి పెరిగినప్పటికీ, భారతదేశాన్ని తన సొంత దేశంగా భావించి ఇక్కడి ప్రజలకు సేవ చేయాలనే నిర్ణయం తీసుకున్న తన ప్రయాణాన్ని కూడా ఈ పుస్తకంలో వివరించారు.

 జీవిత కథ చెప్పాల్సిన సమయం వచ్చిందన్న సోనియా
ఇన్నాళ్లూ తన వ్యక్తిగత జీవితంపై వచ్చిన అనేక కథనాలకు స్పందించకుండా ఉండాలని నిర్ణయించుకున్నానని సోనియా గాంధీ ఇటీవల తెలిపారు. ముఖ్యంగా రాజీవ్ గాంధీతో తన అనుబంధం, కుటుంబ జీవితం గురించి ఇతరులు రాసిన విషయాలపై తాను పెద్దగా స్పందించలేదని గుర్తుచేసుకున్నారు. అయితే ఇప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటనలను, వాటి వెనుక ఉన్న తన ఆలోచనలను ప్రజలకు స్వయంగా చెప్పాల్సిన సమయం వచ్చిందని భావించి ఈ ఆత్మకథ రాసినట్లు వెల్లడించారు.

తల్లి విలువలను గుర్తుచేసుకున్న రాహుల్ గాంధీ
సోనియా గాంధీ ఆరు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో కొనసాగుతున్న తీరును ఆమె కుమారుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశంసించారు. తన తల్లి జీవితంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల పట్ల చూపించే ప్రేమ, నమ్మకం, నిజాయితీ, ఇతరుల పట్ల కరుణ, బాధ్యతాయుతంగా వ్యవహరించడం వంటి విలువలు ఎంతో ముఖ్యమైనవని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సోనియా గాంధీ గతంలో చెప్పిన మాటలను రాహుల్ గుర్తుచేశారు. చిన్నతనంలో నేర్చుకున్న విలువలను ఇప్పటికీ పాటించడానికి ప్రయత్నిస్తున్నానని, సుమారు 60 ఏళ్ల క్రితం రాజీవ్ గాంధీ కలిసిన వ్యక్తినే ఇప్పటికీ తాను అని చెప్పగలనని సోనియా చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కాలం మారినా తన వ్యక్తిత్వానికి, నమ్మకాలకి కట్టుబడి ఉన్నానని ఆమె చెప్పిన మాటల ద్వారా తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా ప్రముఖ ప్రముఖ బుక్ స్టోర్లలో 
సోనియా గాంధీ ఆత్మకథ దేశంలోని పలు ప్రముఖ పుస్తకాల షాపుల్లో ఈరోజు అందుబాటులోకి రానుంది. చెన్నైలోని హిగ్గిన్‌బోథమ్స్, ఢిల్లీలోని బహ్రిసన్స్, మిడిల్‌ల్యాండ్, ముంబైలోని ది వైట్ క్రో, టైటిల్ వేవ్స్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లోని క్రాస్‌వర్డ్ పుస్తకాల షాపుల్లో ఈ పుస్తకాన్ని కొనుగోలు చేయవచ్చు.

కాగా, సోనియా గాంధీ ఇటలీలో జన్మించారు. 1965లో ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్‌లో రాజీవ్ గాంధీని తొలిసారి కలుసుకున్నారు. కొంతకాలం తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. అనంతరం 1968లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత భారతదేశానికి వచ్చి గాంధీ కుటుంబంలో భాగమయ్యారు. ప్రస్తుతం ఆమె జీవితంలోని వ్యక్తిగత, కుటుంబ, రాజకీయ అనుభవాలను తెలుసుకునేందుకు ఈ ఆత్మకథ అవకాశం కల్పించనుంది.

మరిన్ని వార్తలు