ప్రధాని పదవి చేపట్టక పోవడం వెనుక ఇన్ని కారణాలు: సోనియా గాంధీ ఆత్మకథలో ఆసక్తికర అంశాలు

ప్రధాని పదవి చేపట్టక పోవడం వెనుక ఇన్ని కారణాలు: సోనియా గాంధీ ఆత్మకథలో ఆసక్తికర అంశాలు

 పార్టీ తన గుప్పెట్లో ఉన్నా.. నేతల మద్ధతు తనకు ఉన్నా.. 2004లో ప్రధాని పదవిని తిరస్కరించారు సోనియా గాంధీ. దీనిపై రకరకాల ఊహాగానాలు ఉన్నాయి.  అయితే ప్రధాని పదవి చేపట్టకపోవడం వెనుక ఉన్న అసలు నిజాన్ని, ఆసక్తికర అంశాలను తన ఆత్మకథలో వెల్లడించారు కాంగ్రెస్ అగ్రనేత. 2026 నవంబర్ 10 (మంగళవారం)న తన మెమోయిర్ విడుదలయింది. ప్రధాని పదవి గురించి, అలాగే పలు విషయాల గురించి ఆమె తన ఆత్మకథలో పంచుకున్నారు. 

  సోనియా గాంధీ ఆత్మకథ Belonging: A Journey of Loveలో 2004లో ప్రధాని పదవిని తిరస్కరించడం  వెనుక ఉన్న అంతరంగిక పోరాటాన్ని మొదటిసారి వెల్లడించారు.  కాంగ్రెస్ గెలిస్తే ప్రధాని పదవి స్వీకరిస్తారా అని 2004 లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తనను అడిగినట్లు పేర్కొన్నారు. Absolutely not.. అని దాదాపు కోపంతో సమాధానం ఇచ్చారు సోనియా. దీనిపై చాలా క్లారిటీతో ఉన్నానని పిల్లలకు చెప్పారు. నానమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ హత్యలతో బాధను అనుభవించిన రాహుల్, ప్రియాంక.. తను  ప్రధాని కావడం ఇష్టం లేదని.. భవిష్యత్తులో ప్రమాదమేనని భావించి వ్యతిరేకించినట్లు పేర్కొన్నారు.  

ఎన్నికల్లో యూపీఏ  కూటమి గెలిచిన తర్వాత 10 జన్‌పథ్‌లో మిత్రపక్ష నాయకులు సోనియాను ప్రధాని పదవి స్వీకరించాలని ఒత్తిడి చేశారు. అయితే సోనియా ఆ ప్రపోజల్ ను తిరస్కరించారు.  దీనికి అంగీకరించేదే లేదు.. మీరు ప్రధాని పదవి చేపట్టవలసిందే..  అని ఒత్తిడి తెచ్చారు.  ఆ ఒత్తిడికి తలవంచాల్సి వచ్చింది. దీంతో ఠీక్ హై  అని అనాల్సి వచ్చిందట. నాయకులు వెంటనే అభినందనలు చెప్పడం మొదలుపెట్టారు.

అయితే గది బయట ఉన్న ప్రియాంక విషయం తెలుసుకుని రాహుల్‌ను తీసుకువచ్చారు. రాహుల్ కోపంగా మీరు అవును అన్నారా? అని అడిగారు.  వాళ్లు నా మాట  వినలేదు. నేను చేయాలని అనుకోవడం లేదు. కానీ పార్టీ నుంచి ఒత్తిడి ఉంది..  అని చెప్పారు. ఒత్తిడా? మా గురించి మీ మాటేమిటి? అని అడిగారు.  మీరు మొదటి నుంచీ స్పష్టతతో ఉన్నారు.. అలాగే ఉండండి..  ఒత్తిడికి లొంగకండి అని ప్రియాంక చెప్పారు.

సోనియా తన బెడ్‌రూమ్‌కు వెళ్లి రాజీవ్ గాంధీ పటం వైపు చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయారు. ఒక వైపు ఇటలీలో పుట్టి పెరిగిన మహిళ భారత్‌ను నడపగలదా అని సందేహం, మరోవైపు భారత్ తన దేశమైందని, కాంగ్రెస్ కార్యకర్తల అంచనాలు, ఆశలు అంటూ.. అని మనసు కల్లోలం అయింది. నా భావాలు క్షణం క్షణం మారుతున్నాయి అంటూ రాసుకొచ్చారు.  చివరకు సోనియా, నీకు నీవు నిజాయితీగా ఉండు. నువ్వు పదవి విషయంలో ఏం చేయాలో ఎప్పుడో డిసైడయ్యావు.. అలాగే ఉండు.. వదిలేయి! అని తనకు తాను చెప్పుకున్నారు.

కొన్ని గంటల తర్వాత రాహుల్ గదికి వెళ్లి.. నేను నా అసలు నిర్ణయంపైనే నిలబడతాను.. ముందు ఏది నిర్ణయించుకున్నానో దానికే కట్టుబడి ఉంటాను అని చెప్పారట.   ఇది సరైన నిర్ణయం అని రాహుల్ ఆలింగనం చేసుకున్నారు. పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీలు మళ్లీ ఒత్తిడి చేసినా, సోనియా తన అంతరాత్మ ఒప్పుకోవడం లేదని..  చెప్పి, మన్మోహన్ సింగ్ పేరును ప్రతిపాదించారు. 2004 నిర్ణయం వెనుక ఉన్న మానసిక సంఘర్షణను పాఠకులతో మొదటిసారి పంచుకున్నారు సోనియా 

మరిన్ని వార్తలు