పెట్రోల్ కారులో డీజిల్ లేదా డీజిల్ కారులో పెట్రోల్ పోస్తే ఏమవుతుందో తెలుసా ? సగం మందికి తెలియదు !

 పెట్రోల్ కారులో డీజిల్ లేదా డీజిల్ కారులో పెట్రోల్ పోస్తే ఏమవుతుందో తెలుసా ?  సగం మందికి తెలియదు !

మీరు  కారులో పెట్రోల్ కోసం  పెట్రోల్ బంక్‌కు వెళ్లారు. కానీ పొరపాటున పెట్రోల్‌కు బదులుగా డీజిల్ పోస్తే... లేదా  డీజిల్ కారులో పొరపాటున పెట్రోల్ పోస్తే  ? ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎవరైనా కంగారు పడతారు. వెంటనే మనకు వచ్చే డౌట్  ఒక్కటే.. ఇప్పుడు కారు స్టార్ట్ అవుతుందా ? ఇంజిన్ పాడవుతుందా ? వేరే ఇంధనం పోస్తే  కారు ఇంకెన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ? రిపేర్ చేయించడానికి ఎంత ఖర్చవుతుంది ?

నిజానికి పెట్రోల్, డీజిల్ రెండూ వేర్వేరు లక్షణాలు ఉన్న  ఇంధనాలు. వీటితో పనిచేసే ఇంజిన్ల తయారీ విధానం కూడా పూర్తిగా వేరేలా  ఉంటుంది. అందుకే ఒక ఇంధనానికి బదులుగా మరొకటి నింపితే కారులోని కొన్ని ముఖ్యమైన పార్ట్స్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఫ్యూయల్ పంప్, ఫ్యూయల్ లైన్లు, ఇంజిన్‌పై ప్రభావం పడవచ్చు.

అయితే పెట్రోల్ కారులో డీజిల్ నింపితే ఏమవుతుంది ? డీజిల్ కారులో పెట్రోల్ పోస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి ? అసలు కారు ఎంత దూరం వెళ్తుంది? ఇలాంటి పొరపాటు జరిగినప్పుడు వెంటనే ఏం చేయాలి ? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం....

వేరే ఇంధనం నింపితే కారు ఎంత దూరం వెళ్తుంది?
పెట్రోల్ కారులో డీజిల్ లేదా డీజిల్ కారులో పెట్రోల్ నింపినప్పుడు కారు కచ్చితంగా ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుందో చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే అది కొన్ని విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, కార్ ట్యాంకులో కొద్దిగా పెట్రోల్ ఉండగా  డీజిల్ నింపితే ఒక విధమైన పరిస్థితి ఉంటుంది. అదే ట్యాంకులో పూర్తిగా తప్పుడు ఇంధనం నింపితే మరో విధంగా ఉంటుంది.

కొన్ని సందర్భాల్లో కారు స్టార్ట్ కాకపోవచ్చు. మరికొన్ని సందర్భాల్లో ఇంజిన్ స్టార్ట్ అయినా కొద్దిసేపటికే ఆగిపోవచ్చు. ఇంజిన్‌లో అసాధారణ సౌండ్స్  రావడం, కారు సడన్ గా ఆగిపోవడం, ఎక్కువగా పొగ రావడం వంటి సమస్యలు  ఎదురుకావచ్చు. అందుకే ఇంధనం తప్పుగా నింపిన తర్వాత కారు ఎంత దూరం వెళ్తుందని భావించి నడపకూడదు. అలా చేయడం వల్ల నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది.

పెట్రోల్, డీజిల్ మధ్య అసలు తేడా ఏంటి?
చూడటానికి పెట్రోల్, డీజిల్ రెండూ ద్రవ ఇంధనాలే అయినప్పటికీ వాటి లక్షణాలు, మండే విధానం వేర్వేరుగా ఉంటాయి. పెట్రోల్ ఇంజిన్‌లో గాలి, పెట్రోల్ కలిసి సిలిండర్‌లోకి వెళ్తాయి. ఆ తర్వాత స్పార్క్ ప్లగ్ ద్వారా చిన్న నిప్పురవ్వను సృష్టిస్తారు. దీంతో ఇంధనం మండుతుంది. ఈ ప్రక్రియ వల్ల ఇంజిన్ పనిచేస్తుంది. డీజిల్ ఇంజిన్‌లో ముందుగా గాలిని ఎక్కువగా కుదిస్తారు. ఇలా చేయడం వల్ల గాలి ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఆ తర్వాత డీజిల్‌ను ఇంజెక్ట్ చేయడంతో అది వేడిగా ఉన్న గాలిలో మండుతుంది. ఇక్కడ పెట్రోల్ ఇంజిన్‌లాగా స్పార్క్ ప్లగ్ అవసరం ఉండదు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. డీజిల్ ఇంధనం ఫ్యూయల్ పంప్, ఇంజెక్షన్ వ్యవస్థలోని కొన్ని భాగాలకు లుబ్రికంట్గా కూడా పనిచేస్తుంది. పెట్రోల్‌కు ఈ విషయంలో డీజిల్‌తో సమానమైన లక్షణాలు ఉండవు. అందుకే ఈ రెండు ఇంధనాలను ఒకదానికి బదులుగా ఇంకొకటి  ఉపయోగించకూడదు.

పెట్రోల్ కారులో పొరపాటున డీజిల్ నింపితే ఏమవుతుంది?
పెట్రోల్ కారులో డీజిల్ నింపడం వల్ల ఇంజిన్ పనితీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెట్రోల్ ఇంజిన్‌లో డీజిల్ సరిగ్గా ఆవిరి కావడం, మండడం కష్టమవుతుంది. దీంతో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు,  కారు స్టార్ట్ కాకపోవచ్చు, ఇంజిన్ స్టార్ట్ అయినా సరిగ్గా పనిచేయకపోవచ్చు, ఇంజిన్ మధ్యలోనే ఆగిపోవచ్చు, ఎగ్జాస్ట్ నుంచి ఎక్కువ పొగ రావచ్చు, స్పార్క్ ప్లగ్‌లు, ఫ్యూయల్ సిస్టమ్‌లో సమస్యలు రావచ్చు, ముఖ్యంగా డీజిల్ ఎక్కువ మొత్తంలో నింపితే సమస్య తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది.

అయితే ఫ్యూయల్ ట్యాంకులో ఉన్న పెట్రోల్, నింపిన డీజిల్ బట్టి పరిస్థితి మారుతుంది. తక్కువ మొత్తంలో డీజిల్ కలిసినంత మాత్రాన ప్రతిసారి ఇంజిన్ పూర్తిగా పాడవుతుందని చెప్పలేం. కానీ కారును నడపడం మాత్రం సేఫ్ కాదు.

పెట్రోల్ కారులో డీజిల్ నింపితే ఎంత నష్టం జరుగుతుంది?
ఇది ఎంత డీజిల్ నింపారు? కారును స్టార్ట్ చేశారా? ఎంత దూరం నడిపారు? అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ డీజిల్ నింపిన వెంటనే పొరపాటును గుర్తించి, ఇంజిన్ స్టార్ట్ చేయకపోతే పెద్ద నష్టం జరగకుండా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి టైంలో సాధారణంగా ట్యాంకులోని తప్పుగా పోసిన ఇంధనాన్ని బయటకు తీసి, అవసరమైన క్లినింగ్  చేస్తారు. కానీ ఇంజిన్ స్టార్ట్ చేసి కారు నడిపితే డీజిల్ ఫ్యూయల్ లైన్లు, ఇంజెక్టర్‌ల వరకు చేరవచ్చు. దీంతో రిపేర్ ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఈ పొరపాటును ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.

డీజిల్ కారులో పొరపాటున పెట్రోల్ నింపితే ఏమవుతుంది?
డీజిల్ కారులో పెట్రోల్ పోస్తే మరింత పెద్ద సమస్యకు దారితీయవచ్చు. ముఖ్యంగా లేటెస్ట్ డీజిల్ కార్లలో ఫ్యూయల్ పంప్, ఇంజెక్టర్ సిస్టం చాలా ఖచ్చితంగా పనిచేస్తాయి.డీజిల్ ఇంధనం కేవలం ఇంజిన్‌ను నడపడానికి మాత్రమే కాదు.. ఫ్యూయల్ సిస్టమ్‌లోని కొన్ని ముఖ్యమైన భాగాలకు లుబ్రికంట్ గా కూడా ఉపయోగపడుతుంది.

కానీ పెట్రోల్‌లో డీజిల్‌కు ఉండే లుబ్రికంట్  లక్షణాలు ఉండవు. అందువల్ల డీజిల్ ట్యాంకులో పెట్రోల్ కలిస్తే ఫ్యూయల్ పంప్, ఇంజెక్టర్‌లలో సరైన లూబ్రికేషన్ తగ్గి ఘర్షణ పెరిగే ప్రమాదం ఉంటుంది.

దీంతో  ఫ్యూయల్ పంప్ దెబ్బతినవచ్చు, ఫ్యూయల్ ఇంజెక్టర్‌లు పాడవవచ్చు, ఫ్యూయల్ లైన్లలో సమస్యలు రావచ్చు, ఇంజిన్ పనితీరు తగ్గవచ్చు, కారు కుదుపులకు గురై ఆగిపోవచ్చు.. తీవ్రమైన సందర్భాల్లో ఇంజిన్‌కు కూడా నష్టం కలగవచ్చు. ముఖ్యంగా కామన్ రైల్ డీజిల్ ఇంజిన్‌లలో ఇలాంటి పొరపాట్లను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి.

డీజిల్ కారులో పెట్రోల్ పోసిన తర్వాత ఇంజిన్ స్టార్ట్ చేస్తే ఏమవుతుంది?
ఇదే అత్యంత ముఖ్యమైన విషయం. డీజిల్ కారులో పొరపాటున పెట్రోల్ నింపిన తర్వాత ఇంజిన్‌ను స్టార్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇంజిన్ స్టార్ట్ చేయగానే ఫ్యూయల్ పంప్ పనిచేయడం ప్రారంభిస్తుంది. ట్యాంకులో ఉన్న పెట్రోల్ ఫ్యూయల్ లైన్లు, పంప్, ఇంజెక్టర్‌ల వరకు చేరుతుంది. దీంతో ఫ్యూయల్ సిస్టమ్‌లోని భాగాలకు అవసరమైన లుబ్రికంట్ తగ్గి, ఘర్షణ పెరిగే అవకాశం ఉంటుంది. కారు నడుస్తున్న కొద్దీ ఈ సమస్య ఎక్కువవుతుంది. ఒకవేళ కారు ఇప్పటికే స్టార్ట్ చేసి ఉంటే, సురక్షితమైన ప్రదేశంలో వెంటనే ఆపేయాలి. మళ్లీ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించకూడదు.

ముఖ్యంగా కేవలం ట్యాంకులోని ఇంధనాన్ని బయటకు తీస్తే సరిపోతుందని అనుకోకండి. తప్పుడు ఇంధనం ఫ్యూయల్ సిస్టమ్‌లోకి చేరిందా లేదా అనేది కూడా మెకానిక్‌తో చెక్ చేయించాలి.

చివరిగా.....పెట్రోల్ కారులో డీజిల్ నింపినా, డీజిల్ కారులో పెట్రోల్ నింపినా నిర్లక్ష్యం చేయకూడదు. తప్పుడు ఇంధనం నింపిన తర్వాత కారు ఎంత దూరం ప్రయాణిస్తుందో ముందుగా అంచనా వేయడం సాధ్యం కాదు. ముఖ్యంగా డీజిల్ కారులో పెట్రోల్ నింపినప్పుడు ఫ్యూయల్ పంప్, ఇంజెక్టర్‌లకు తీవ్రమైన నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది.

కాబట్టి ఇలాంటి పొరపాటు జరిగినప్పుడు కారు స్టార్ట్ చేసి పరీక్షించడం కంటే, ఇంజిన్ ఆఫ్‌లోనే ఉంచి ట్యాంక్‌ను శుభ్రం చేయించడం ఉత్తమం. ఒక్క చిన్న నిర్లక్ష్యం వల్ల వేల రూపాయల మరమ్మతు ఖర్చు రావచ్చు. అందుకే పెట్రోల్ బంక్‌లో ఇంధనం నింపేటప్పుడు మీ కారు పెట్రోల్ వాహనమా, డీజిల్ వాహనమా అనే విషయాన్ని ఒకసారి సరిచూసుకోవడం చాలా ముఖ్యం.