ఎల్ నినోతో రానున్న రోజుల్లో నీటి సమస్య.. రైతులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

ఎల్ నినోతో రానున్న రోజుల్లో నీటి సమస్య.. రైతులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

నర్సాపూర్: ఎల్ నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుందని, రానున్న రోజుల్లో నీటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎల్ నినో ప్రభావం, వాతావరణ పరిస్థితులు, వ్యవసాయం, తాగునీటి సమస్యలపై మాట్లాడారు.

ఎల్ నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులకు ముందస్తుగా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఎల్ నినో సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, తొందరపడి పంటలు సాగు చేస్తే నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని సూచించారు. ఇప్పుడే జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటాయని పేర్కొన్నారు.

నీటి అవసరం ఉన్న ప్రాంతాల్లోనే బోర్లు వేస్తామని, ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రస్తుతం వేసవి తరహా తీవ్రమైన ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయని, జపాన్‌లో కూడా ప్రస్తుతం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోందన్నారు.

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పూర్తయి ఉంటే తెలంగాణకు ఎంతో ప్రయోజనం చేకూరేదని మంత్రి అభిప్రాయపడ్డారు. మేడిగడ్డ ప్రాజెక్టు విఫలమైన ప్రాజెక్టు అని విమర్శించారు. మేడిగడ్డ వద్ద నీటిని ఎత్తిపోయవద్దని ఎన్‌డీఎస్‌ఏ సూచించిందని తెలిపారు. రాష్ట్రంలో నీటి సమస్యలు పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరించాలని మంత్రి వివేక్ వెంకటస్వామి కోరారు.