HDFC బ్యాంక్ ఎఫ్‌డీ వడ్డీ రేట్ల పెంపు: సీనియర్ సిటిజన్లకు భారీ లాభం

HDFC బ్యాంక్ ఎఫ్‌డీ వడ్డీ రేట్ల పెంపు: సీనియర్ సిటిజన్లకు భారీ లాభం

ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసుకునే కస్టమర్లకు దేశంలోని ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గుడ్‌న్యూస్ చెప్పింది. రూ. 3 కోట్ల లోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త వడ్డీ రేట్లు నవంబర్ 4, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ పెంపుతో సాధారణ కస్టమర్లకు ఏడాదికి గరిష్టంగా 6.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.20 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం. 

షార్ట్‌టర్మ్ డిపాజిట్ల విషయానికి వస్తే.. 61 రోజుల నుంచి 6 నెలల కాలపరిమితి గల డిపాజిట్లపై వడ్డీ రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 4.75 శాతానికి చేర్చారు. అలాగే 6 నెలల ఒక రోజు నుంచి 9 నెలల కాలపరిమితి గల డిపాజిట్లపై 15 బేసిస్ పాయింట్లు పెంచి 5.65 శాతానికి పెంచగా, 9 నెలల ఒక రోజు నుంచి ఏడాది లోపు మెచ్యూరిటీ అయ్యే డిపాజిట్లపై వడ్డీని గతంలో ఉన్న 5.75 శాతం నుంచి 5.90 శాతానికి పెంచారు.

అలాగే లాంగ్ టర్మ్ కోసం పెట్టుబడులపై కూడా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మంచి రాబడులను అందిస్తోంది. 18 నెలల ఒక రోజు నుంచి రెండేళ్ల కాలపరిమితి డిపాజిట్లకు 6.50 శాతం, మూడేళ్ల నుంచి ఐదేళ్ల డిపాజిట్లకు 6.60 శాతం వడ్డీ ఇస్తున్నారు. ఇక సీనియర్ సిటిజన్ల విషయానికి వస్తే.. వారికి మూడేళ్ల ఒక రోజు నుంచి ఐదేళ్ల కాలపరిమితికి గరిష్టంగా 7.20 శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే 5 సంవత్సరాల ఒక రోజు నుంచి 10 సంవత్సరాల డిపాజిట్లపై వారి వడ్డీ రేటు 6.65 శాతం నుంచి 7.10 శాతానికి పెరిగింది.

ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో సేఫ్ రిటర్న్స్ కోరుకునే ఇన్వెస్టర్లకు ఈ పెంపు ఎంతగానో ఉపయోగపడనుంది. హెచ్‌డీఎఫ్‌సీ బాటలోనే ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాంటి ఇతర లెండర్లు కూడా గత కొన్ని నెలలుగా తమ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరిస్తూ వస్తున్నాయి. దీంతో కస్టమర్లు తమ పొదుపులపై గతంలో కంటే ఎక్కువ లాభాలను ఆర్జించే అవకాశం లభిస్తోంది.