బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు షాక్.. హోమ్ లోన్, కారు లోన్ EMIలు పెరిగాయ్!

బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు షాక్.. హోమ్ లోన్, కారు లోన్ EMIలు పెరిగాయ్!

ప్రభుత్వ దిగ్గజ బ్యాంక్ 'బ్యాంక్ ఆఫ్ బరోడా' కస్టమర్లకు షాకింగ్ వార్త చెప్పింది. రుణ వడ్డీ రేట్లను భారీగా పెంచేసింది. వివిధ రుణ కాలపరిమితులపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను(MCLR) ఏకంగా 20 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు అధికారికంగా వెల్లడించింది. తాజా లోన్ రేట్ల పెంపుతో బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్న సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలకు EMIల ఆర్థిక భారం మరింత పెరగనుంది.

ఈ కొత్త వడ్డీ రేట్లు నవంబర్ 12, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. బ్యాంకు ప్రకటించిన వివరాల ప్రకారం.. ఒక నెల కాలపరిమితి ఉన్న ఎంసీఎల్ఆర్ 7.95 శాతం నుంచి 8.00 శాతానికి చేరింది. అలాగే 3 నెలల రేటు 8.30 శాతం నుంచి 8.50 శాతానికి, 6 నెలల కాలపరిమితి కలిగిన రుణాలు 8.50 శాతం నుంచి 8.70 శాతానికి పెరిగాయి. ఇక రిటైల్ లోన్లకు అత్యంత కీలకమైన ఒక ఏడాది ఎంసీఎల్ఆర్ రేటును 8.75 శాతం నుంచి 8.85 శాతానికిసవరించారు. అయితే ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ మాత్రం ఎలాంటి మార్పు లేకుండా యథావిధిగా 7.85 శాతానే కొనసాగడం ఒక్కటే కొంత ఊరటనిచ్చే అంశం.

ఈ వడ్డీ రేట్ల పెంపు నేరుగా హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఇతర రిటైల్ క్రెడిట్ సౌకర్యాలు కలిగిన వారిపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఎంసీఎల్ఆర్ ఆధారిత లోన్లు తీసుకున్న కస్టమర్లకు.. వారి రీసెట్ తేదీలు వచ్చినప్పుడు వడ్డీ భారంతో పాటు నెలవారీ EMIలు పెరిగే అవకాశం ఉంది. లేదంటే లోన్ చెల్లించే కాలాన్ని బ్యాంకులు పొడిగించవచ్చు. అయితే ఆర్‌బీఐ రెపో రేటు వంటి ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్‌లకు అనుసంధానించబడిన లోన్ తీసుకున్న వినియోగదారులపై మాత్రం ఈ ఎంసీఎల్ఆర్ పెంపు ప్రభావం ఉండదని బ్యాంక్ స్పష్టం చేసింది.

తాజాగా వడ్డీ రేట్లను పెంచడానికి అసలు కారణాలను మాత్రం బ్యాంక్ వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు వెంటనే తమ లోన్ అగ్రిమెంట్లను, రీసెట్ తేదీలను పరిశీలించుకోవడం మంచిది. వడ్డీ పెంపు వల్ల నెలవారీ బడ్జెట్ తప్పుకుండా ఉండేందుకు ముందస్తుగా ప్లాన్ చేసుకోవటం ఎంతైనా అవసరం.

మరిన్ని వార్తలు