- సెప్టెంబర్లో 15 శాతం అప్
- రిటైల్ లోన్లలో 21 శాతం వృద్ధి
- పారిశ్రామిక రంగంలో తక్కువ గ్రోత్ నమో
న్యూఢిల్లీ: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీ) లోన్ల వ్యాపారం దూసుకెళ్తోంది. 2026 సెప్టెంబర్ నాటికి వీటి నుంచి లోన్లు తీసుకున్న కస్టమర్లు తిరిగి చెల్లించాల్సిన మొత్తం రూ.61.69 లక్షల కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే నెలలో ఉన్న రూ.53.46 లక్షల కోట్లతో పోలిస్తే రూ.8.23 లక్షల కోట్ల పెరుగుదల నమోదైంది. వార్షిక రుణ వృద్ధి 13.3 శాతం నుంచి 15.4 శాతానికి చేరింది. ఆర్బీఐ విడుదల చేసిన లెక్కలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ముఖ్యంగా రిటైల్ లోన్లు, వ్యవసాయ రంగానికి అందించిన లోన్లలో వేగవంతమైన వృద్ధి నమోదైంది.
పారిశ్రామిక రంగం, సేవల రంగానికి ఇచ్చే లోన్ల పెరుగుదల మాత్రం మందగించింది. ఎన్బీఎఫ్సీల రుణ వృద్ధికి ప్రధానంగా రిటైల్ విభాగం ఊతమిచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్లో ఈ విభాగంలో లోన్ల వృద్ధి 21.9 శాతానికి చేరింది. 2025 సెప్టెంబర్లో నమోదైన 16.8 శాతంతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల. ముఖ్యంగా హోం లోన్లు, బంగారు ఆభరణాలపై లోన్లు, వాహన లోన్లకు డిమాండ్ పెరిగింది. వ్యక్తిగత అవసరాల కోసం లోన్లు తీసుకునే వారి సంఖ్య పెరగడం ఈ వృద్ధికి కారణంగా కనిపిస్తోంది.
వ్యవసాయ రంగానికి లోన్ల వెల్లువ
వ్యవసాయానికి, అనుబంధ కార్యకలాపాలకు ఎన్బీఎఫ్సీలు అందించిన లోన్లలోనూ మంచి వృద్ధి కనిపించింది. 2026 సెప్టెంబర్లో ఈ విభాగం రుణ వృద్ధి 17.8 శాతానికి చేరుకుంది. గత ఏడాది ఇదే సమయంలో ఈ వృద్ధి కేవలం 5.2 శాతంగా ఉంది. ఏడాది వ్యవధిలో ఈ రంగానికి లోన్ల మంజూరు గణనీయంగా పెరిగింది. రిటైల్, వ్యవసాయ రంగాలు దూసుకెళ్తుంటే పారిశ్రామిక రంగంలో మాత్రం లోన్ల పెరుగుదల నెమ్మదించింది. 2025 సెప్టెంబర్లో 10.2 శాతంగా ఉన్న వృద్ధి 2026 సెప్టెంబర్లో 7.4 శాతానికి పరిమితమైంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల రంగానికి ఇచ్చే లోన్లలో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించలేదు.
సేవల రంగానికి లోన్లు తక్కువే
సేవల రంగానికి ఎన్బీఎఫ్సీలు అందించే లోన్ల వృద్ధి కూడా తగ్గింది. గత ఏడాది సెప్టెంబర్లో 23 శాతంగా ఉన్న వృద్ధి ఈ ఏడాది సెప్టెంబర్లో 17.3 శాతానికి దిగివచ్చింది. మొత్తంగా చూస్తే రిటైల్, వ్యవసాయ రంగాలు ఎన్బీఎఫ్సీల రుణ విస్తరణకు ప్రధాన చోదక శక్తులుగా నిలిచాయి. అయితే పారిశ్రామిక, సేవల రంగాల్లో మందగమనం భవిష్యత్తులో లోన్ల మంజూరు తీరుపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
