ఏడీఆర్ ఎస్టేట్స్ ఎండీకి కూడా..
రూ.2 వేల చొప్పున జరిమానా విధించిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలోని బాచుపల్లిలో 17.10 ఎకరాల భూ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలను అమలు చేయని కారణంగా.. ఏడీఆర్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీతోపాటు ముగ్గురు రిజిస్ట్రేషన్ అధికారులకు హైకోర్టు జైలుశిక్ష విధించింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ దామోదర్‌రావు, సబ్‌రిజిస్ట్రార్ పి.శ్రీను, జాయింట్ సబ్‌రిజిస్ట్రార్లు వి.అశోక్, పి.మధుబాబులకు 6 నెలల సాధారణ జైలుశిక్ష, రూ.2 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.
బాచుపల్లి సర్వే నంబర్ 140లోని భూమికి సంబంధించి 2023లో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ ఏపీకి చెందిన చలసాని కల్యాణి లీల దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణ చేపట్టింది. వివాదాస్పద భూమికి సంబంధించిన కొనుగోలు పత్రాన్ని ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ నుంచి తొలగించాలంటూ ఏడీఆర్ ఎస్టేట్స్ చేసిన అభ్యర్థనపై సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌చేస్తూ కల్యాణి లీల అప్పీలు దాఖలు చేశారు. 2023లో డివిజన్ బెంచ్ ఆ ఉత్తర్వుల అమలును నిలిపివేయగా, 2025లో అప్పీలును అనుమతించి సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేసింది.
అయినప్పటికీ రిజిస్ట్రేషన్లు కొనసాగించడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. మధ్యంతర ఉత్తర్వుల కాపీ అందిన తర్వాత కూడా వి.అశోక్ రిజిస్ట్రేషన్లు చేశారని, ఉత్తర్వులు రద్దయిన అనంతరం పి.శ్రీను నాలుగు రిజిస్ట్రేషన్లు చేశారని పేర్కొంది. కుత్బుల్లాపూర్ సబ్‌రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వహించిన పి.మధుబాబు కూడా రిజిస్ట్రేషన్లు కొనసాగించారని తెలిపింది. ఒకే కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులకు కోర్టు ఆదేశాల గురించి తెలియదనడం సమర్థనీయం కాదని, ఉద్దేశపూర్వకంగానే ఉత్తర్వులను ఉల్లంఘించారని స్పష్టం చేసింది. అప్పీలుకు అవకాశం కల్పిస్తూ శిక్ష అమలును 4 వారాలపాటు నిలిపివేసింది. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, జిల్లా రిజిస్ట్రార్లపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను కొట్టివేసింది.
