హైదరాబాద్: తెలంగాణలో ఎప్పుడూ ఎన్నికలు జరిగిన కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు గెలవడం ఖాయమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తోందని.. రాహుల్ గాంధీ దేశ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వస్తామనే బీఆర్ఎస్ కలలు ఫలించవని అన్నారు.
సోమవారం (నవంబర్ 9) వికారాబాద్ లగచర్ల వేదికగా ప్రభుత్వం రైతన్నతో ఆత్మీయ సభ నిర్వహించింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఫ్రీ కరెంట్, సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని చెప్పారు.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా రేషన్ ద్వారా పేదలకు సన్నబియ్యం పంపిణీ చేసే చారిత్రాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతాంగానికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. రైతు రుణ మాఫీ, రైతు భరోసా, రైతు బీమా, సన్న వడ్లకు బోనస్ అందిస్తూ రైతన్నలకు అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఓర్వలేక ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి పనికి అడ్డుపడుతూ అభివృద్ధి జరగకుండా కుట్రలకు పాల్పడుతోందని మండిపడ్డారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
