Varanasi Story: రాజమౌళి-మహేష్ బాబు మూవీ అప్డేట్.. వైరల్ అవుతున్న వారణాసి స్టోరీ ఇదేనా?

Varanasi Story: రాజమౌళి-మహేష్ బాబు మూవీ అప్డేట్.. వైరల్ అవుతున్న వారణాసి స్టోరీ ఇదేనా?

భారీ బడ్జెట్.. అంతకుమించిన అంచనాలు.. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రాజెక్ట్ ‘వారణాసి’. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఇద్దరూ తమ కెరీర్‌లోనే అత్యుత్తమ ఎఫర్ట్స్ పెడుతున్నారనే టాక్ ఇప్పటికే ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. మరోవైపు సినిమా కథ, అందులోని పాత్రలు, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ గురించి రోజుకో ఆసక్తికరమైన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇటీవల రణబీర్ కపూర్ నటించిన ‘రామాయణం’ సినిమాకు సంబంధించిన చర్చలు ఊపందుకోవడంతో.. ఇప్పుడు అందరి దృష్టి ‘వారణాసి’లోనూ రామాయణానికి సంబంధించిన ఎపిసోడ్‌పైనే పడింది. అసలు మహేష్ బాబు సినిమాలో రామాయణం నేపథ్యం ఎలా ఉండబోతోంది? పురాణాలకు, సైన్స్ ఫిక్షన్‌కు రాజమౌళి ఎలాంటి లింక్ ఇవ్వబోతున్నారు? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ క్రమంలోనే ‘వారణాసి’ కథ ఇదేనంటూ ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ సినీ సర్కిల్లో తెగ వైరల్ అవుతోంది. గతంలోనూ వారాణసి సినిమా కథపై ఎన్నో ఊహాగానాలు వచ్చినప్పటికీ.. తాజాగా ప్రచారంలోకి వచ్చిన ఈ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ మాత్రం అభిమానులను మరింత ఎగ్జైట్ చేస్తోంది.

రామాయణ కాలంలోకి మహేష్ బాబు!

‘వారణాసి’ కథలో టైమ్ ట్రావెల్ కీలక పాత్ర పోషించనుందట. ముఖ్యంగా రామాయణ కాలానికి, ప్రస్తుత కాలానికి మధ్య ఓ ఆసక్తికరమైన లింక్‌ను రాజమౌళి సృష్టించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కథనంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్న ‘కుంభ’ పాత్ర అత్యంత కీలకంగా ఉంటుందట. కుంభకర్ణుడి పునర్జన్మగా భావించే ఈ పాత్రకు రావణుడి దగ్గర ఉన్న అత్యంత శక్తిమంతమైన నవరత్న మాలే ప్రధాన లక్ష్యమని టాక్. రామ-రావణ యుద్ధం అనంతరం ఆ మాలలోని తొమ్మిది రత్నాలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెల్లాచెదురుగా పడిపోతాయట. వాటన్నింటినీ తిరిగి సేకరించి తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని కుంభ ప్రయత్నిస్తాడని టాక్.

వార్మ్‌హోల్ ద్వారా మహేష్‌ గతంలోకి!

ఈ క్రమంలోనే మహేష్ బాబు పాత్ర కథలోకి ఎంట్రీ ఇస్తుందట. చెల్లాచెదురైన ఆ తొమ్మిది రత్నాలను వెతికి తీసుకురావాల్సిన బాధ్యతను కుంభ.. మహేష్ బాబు (రుద్ర)కు అప్పగిస్తాడని స్టోరీ లైన్ వైరల్ అవుతుంది. ఈ అన్వేషణలో భాగంగా హీరో ఓ వార్మ్‌హోల్ ద్వారా ఏకంగా రామాయణ కాలంలోకి ప్రయాణిస్తాడట. అక్కడి నుంచే అసలు కథలో ఉత్కంఠ మొదలవుతుందని తెలుస్తోంది. ఆ తొమ్మిది రత్నాలన్నీ కుంభ చేతికి చిక్కితే ప్రపంచానికి పెను ప్రమాదం తప్పదని మహేష్ పాత్రకు అర్థమవుతుందట. దీంతో కుంభ లక్ష్యాన్ని అడ్డుకోవడమే హీరో ముందున్న అసలు సవాలుగా మారుతుందని ప్రచారం జరుగుతోంది.

రామ-రావణ యుద్ధంలో కీలక ఘట్టం..

ఇక ఈ స్టోరీ లైన్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశం రామ-రావణ యుద్ధం. కుంభ చేతికి నవరత్న మాల చేరకుండా అడ్డుకోవడానికి మహేష్ మరోసారి గతంలోకి ప్రయాణిస్తాడట. రామ-రావణ యుద్ధ సమయంలో జరిగిన ఓ కీలక ఘట్టాన్ని మార్చి, ఆ తొమ్మిది రత్నాలు చెల్లాచెదురు కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తాడని కథనం సారాంశం చెబుతోంది.

►ALSO READ | Vijay Rashmika: ఫారెన్లో విజయ్–రష్మిక దీపావళి సెలబ్రేషన్స్.. రొమాంటిక్ పిక్, ఫ్యామిలీ ఫొటోలు వైరల్!

అంటే కేవలం గతంలోకి వెళ్లి రత్నాలను వెతకడమే కాకుండా.. చరిత్రలోనే ఓ కీలక పరిణామాన్ని మార్చే స్థాయిలో హీరో పాత్ర ఉంటుందన్నమాట. పురాణ గాథకు టైమ్ ట్రావెల్, వార్మ్‌హోల్, సైన్స్ ఫిక్షన్ అంశాలను జోడిస్తే తెరపై ఎలాంటి అద్భుతం ఆవిష్కృతమవుతుందోనని మహేష్ & జక్కన్న ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

నిజంగానే ఇదే వారణాసి కథనా?

ఈ వైరల్ స్టోరీ లైన్‌లో నిజమెంత? మహేష్ బాబు పాత్రకు, రామాయణానికి ఉన్న సంబంధం ఏమిటి? పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర నిజంగానే కుంభకర్ణుడి పునర్జన్మనా? అనే విషయాలపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వారాణసి స్టోరీ భారీ అంచనాలను పెంచేస్తోంది. ముఖ్యంగా ఇందులోని టైమ్ ట్రావెల్, నవరత్న మాల, రామాయణ కాలం వంటి అంశాలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. ఒకవేళ ఈ ప్రచారంలో ఉన్న కథాంశమే నిజమైతే.. పురాణ గాథను సరికొత్త సైన్స్ ఫిక్షన్ ప్రపంచంతో ముడిపెట్టి రాజమౌళి మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, రాజమౌళి ఆలోచనను అంతా ఈజీగా ట్రాక్ చేయడం లేదా అందుకోవడం చాలా కష్టమైన పని అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా వారణాసి కథలో నిజం తెలియాలంటే వచ్చే ఏడాది ఏప్రిల్ 27 వరకు వెయిట్ చేయక తప్పదు..