పెద్దలకు, దేవుడికి నమస్కారం ఎందుకు చేయాలి ? నమస్కారం వెనుక ఉన్న అసలు అర్థం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

 పెద్దలకు, దేవుడికి నమస్కారం ఎందుకు చేయాలి ? నమస్కారం వెనుక ఉన్న అసలు అర్థం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

భగవంతుడికి, గురువుకు, పెద్దలకు నమస్కారం చేయడం మన సంప్రదాయం. మనిషిని కాకుండా, ప్రతి మనిషిలోని ఆత్మను గౌరవించడమే నమస్కారం. ఇది ఒక రకంగా భక్తి క్రియ నమః - అంటే త్యాగమని వాచ్యార్థం. "నేను నీకంటే తక్కువవాడను. నీవు నాకంటే గొప్పవాడవు" అనే 'దాస్యభావం' (దేవుడికి, దైవ సంబంధ విషయాలకు) దీనిలో స్ఫురిస్తుంది.

"నాకు నేను ఉపయుక్తుడను కాను. కాబట్టి, నీవే నన్ను ఉద్దరించగలవాడవు" అని ఆత్మార్పణము చేసుకోవాలనే అపూర్వయోగాన్ని 'నమః' అనే పదం సూచిస్తుంది. నమస్కారం వంటి తారక మంత్రం ఇంకొకటి లేదు. శత్రువు యొక్క శత్రుభావాన్ని సమూలంగా పోగొట్టగల శక్తి ఈ నమస్కారానికి ఉంది. నమస్కారంతో సకలార్థసిద్ధిని పొందవచ్చు. శ్రీకృష్ణ పరమాత్ముడికి ఒక్కసారి నమస్కరిస్తే, పది ఆశ్వమేథయాగాల తర్వాత చేసే అవభృథ స్నానంతో సమానమని భారతంలో ఉంది. నమస్కారం వలన దైన్యభావం అలవడుతుంది. దీనివల్ల మనలోని అహంకారం తగ్గుతుంది. దైన్యమనగా (నిరాడంబరత) సేవాభావమని అర్థం. సేవాభావం వలన, భగవద్భక్తి పెంపొంది, భగవంతునిపై ఆరాధనాభావం కలుగుతుంది. అట్టి ప్రేమారాధానమే 'భక్తి'. అట్టి భక్తితో సాధించలేని సిద్ధులు లేవు. భక్తియే ఆత్మసాక్షాత్కార జ్ఞానానికి మూలం. పరమభక్తియే మోక్షప్రాప్తికి ఉత్తమ సాధనం. నమస్కారం - కాయకము, వాచికము, మానసికము అని మూడు విధాలు.

కాయకము: ఇది శారీరకమైనది. రెండు అరచేతులు కలిపి చేసే నమస్కారం. సాష్టాంగ నమస్కారం అంటే, నేలపై పడుకుని అష్టాంగాల్ని (మనస్సు, బుద్ధి, అభిమానం, రెండు పాదాలు, రెండు చేతులు, శిరస్సు) నేలపై మోపి చేసేది. దీనిలోనే మరొకటి ధ్యాన ముద్ర నమస్కారం. ఈ ధ్యానముద్ర నమస్కారంతో, భగవంతుని ధ్యానిస్తే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. 

వాచికము: నోటితో ఉచ్ఛరించునది. "నమః". "నమస్కారం" మొదలగు శబ్దములతో మన మనోభావాన్ని తెలుపటం. ఎవరితోనైనా 'నమస్కారం' అని నోటితో వినయపూర్వకంగా చెప్తే చాలు.

ALSO READ : చలికాలంలో ఆకుకూరలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ తింటున్నారా ?

మానసికము: ఇది పూర్తిగా మనసులో చేసుకునే నమస్కారం. దైవంపట్ల, మనఃపూర్వకమైన 'నమస్కార' భావమును మనస్సునందే ఏకాగ్రతతో తలచుట.. ఏవిధమైన నమస్కారమైనప్పటికీ ఆత్మార్పణ చేసుకొనడమే అవుతుంది. కాయక నమస్కారంలో (శారీరక సమస్కారాలు) అష్టాంగము, పంచాంగము, త్రయ్యంగము, ఏకాంగము అని నాలుగు విధానాలున్నాయి.

అష్టాంగ నమస్కారం: అష్టాంగ నమస్కారం ఉత్తమమైనది. ముఖ్యమైనది, తప్పని సరిగా ఆచరించవలసినది. "శిరోహస్తాచ కర్ణాచ చుబుకమ్ బాహు యుగ్మం అష్టాంగ చ నమస్కారం" అనగా శిరస్సు, రెండుచేతులు, రెండుచెవులు, గడ్డం, రెండు భుజాలు వీనిని నేలపై ఆనించి చేయబడు నమస్కారం 'అష్టాంగము' అని అంటారు. దేవతలకు, గురువులకు, పెద్దలకు ఈ విధమైన నమస్కారం చేయాలి. (స్త్రీలు ఈవిధమైన నమస్కారాన్ని చేయరాదు).

'గురువు'కు ఈ క్రింది విధంగా నమస్కరించటం శ్రేయస్కరం.

"వృత్యప్త పాణినా కార్యమున సంగ్రహణం గురువు:!    
సవ్యేన సవ్యః స్పృష్టవ్యో దక్షిణేవ చ రక్షణ |["

అనగా రెండు చేతులను మార్చి పట్టుకుని (అనగా కుడిచేతిలో గురువు కుడిపాదాన్ని ఎడమచేతిలో గురువు ఎడమపాదాన్ని) పట్టుకుని నమస్కరించాలి. మీ పాదపద్మాలే నాకు శరణ్యమనే భక్తి భావనతో గురువుకు నమస్కరించాలి.

పంచాంగ నమస్కారం: "శిరోహస్తాచ బాహుచ కృత్యా జానునీ, సంస్థితా ఇదం పంచాంగ మేవోక్తమ్". అనగా శిరస్సు, రెండుచేతులు, రెండు భుజాలు, మోకాళ్ళు నేలపై ఆన్చి (మోకాళ్ళపై వంగి) చేయబడు నమస్కారం. ఈ విధమైన నమస్కారం స్త్రీలకు ఉత్తమమైనది.

త్రయ్యంగ నమస్కారం: "హస్తా బద్ధ్వాతు ముకళ వమ్మార్నిదేశేనియోజయేత్" అంటే రెండుచేతులు ముకుళించి (జోడించి) తలపై ఉంచి చేసే నమస్కారం.

ఏకాంగ నమస్కారం: "ఏకాంగంతు నమస్కారం శిరసైనా కృతాభవేత్”.. అంటే తలను మాత్రం వంచి చేయబడు నమస్కారం. తప్పనిసరి పరిస్థితుల్లోనే (చేతులను జోడించి నమస్కరించ లేని పరిస్థితులలోనే) ఈ పద్ధతిలో నమస్కరించాలి.

"ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్బ్యాంకరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాం గముచ్యతే"

వక్షఃస్థలాన్ని, శిరస్సును భూమిని తాకించి, మనస్సులో దైవమును ప్రార్ధన చేస్తూ, 'నమః' అని పలుకుతూ, రెండు పాదాగ్రాలను కలుపుతూ, రెండు చేతులతో నమస్కరిస్తూ, రెండు చెవులను నేలకు తాకిస్తూ బోర్లాపడి నమస్కరించటం "సాష్టాంగ నమస్కారం". ఈ విధమైన నమస్కారంలో కాయికము, వాచికము, మానసికము అనే త్రివిధాలైన నమస్కారాలు కలిసి ఉన్నాయి. అనగా మనస్సు చేత చింతించుట, వాక్కుచే 'నమః' అని అనటం, బోర్లగిలి అష్టాంగనమస్కారం చేయుట కలిసున్నాయి. ఇంకా రెండుచేతులు, రెండుకాళ్ళు, వక్షస్థలం, నొసలు, రెండు భుజాలు మొత్తం ఎనిమిది అంగాలను నేలకు తాకుతున్నట్లు బోర్లగిలి నమస్కరిస్తున్నందువల్ల "సాష్టాంగ నమస్కారం" అంటారు. ఈవిధమైన "సాష్టాంగ నమస్కారం" శ్రేష్టమైనది. స్త్రీలు సాష్టాంగ నమస్కారాలు చేయరాదు. 

నమస్కారాలు చేయటంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మొక్కుబడిగా, హడావిడిగా కాక మనస్ఫూర్తిగా నమస్కరించాలి. రెండు చేతులను పూర్తిగా కలిపి హృదయస్థానాన్నిగాని, నుదుటనుగాని స్పర్శిస్తూ నమస్కరించాలి. నమ్రతభావనతో నమస్కరించాలి. ఇవన్నీ పూర్తిగా పాటించి నమస్కరిస్తేనే 'నమస్కారం' నమ్రతాక్రియకు పరిపూర్ణత సిద్ధిస్తుంది.