మనోజ్ బాజ్‌పాయ్, బోమన్ ఇరానీ, దివ్య దత్తా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’ (Last Man in Tower). అరవింద్ అడిగా రాసిన నవల ఆధారంగా బెన్ రేఖి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా నిర్మించింది. సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ, నవంబర్ 6 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమ్ అవుతూ ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తుంది. ముంబైలోని ఓ పాత అపార్ట్‌మెంట్ రీ డెవలప్‌మెంట్ కోసం అందరూ ఇళ్లు ఖాళీ చేసేందుకు సిద్ధమవుతారు. కానీ రిటైర్డ్ టీచర్ యోగేశ్ మిశ్రా (మనోజ్ బాజ్‌పాయ్) మాత్రం తన ఇంటిని వదులుకోవడానికి నిరాకరిస్తాడు. దీంతో సొసైటీలోని వారందరితో అతడి పోరాటం మొదలవుతుంది. ఈ క్రమంలో ఎదురయ్యే భావోద్వేగాలు, మానవ సంబంధాలే కథాంశంగా ఈ చిత్రం తెరకెక్కింది.
పూర్తి కథేంటంటే?
ముంబైలోని ఓ పాత అపార్ట్‌మెంట్‌లో నివసించే రిటైర్డ్ టీచర్ యోగేశ్ మిశ్రా (మనోజ్ బాజ్‌పాయ్) తన ఇంటిని వదులుకోవడానికి ఇష్టపడడు. ఆ అపార్ట్‌మెంట్‌ను రీడెవలప్ చేయాలని బిల్డర్ ధర్మెన్ షా (బొమన్ ఇరానీ) ప్రయత్నిస్తాడు. అందులో నివసించే మిగతా వారంతా బిల్డర్ ఆఫర్‌కు అంగీకరించి ఇళ్లు ఖాళీ చేయడానికి సిద్ధమవుతారు. కానీ యోగేశ్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోడు.
మరోవైపు సంగీత పూరి (దివ్య దత్తా) తన కుమారుడి భవిష్యత్తు కోసం కొత్త ఇంటిని ఆశిస్తుంది. దీంతో యోగేశ్‌కు, మిగతా అపార్ట్‌మెంట్ వాసులకు మధ్య విభేదాలు మొదలవుతాయి. ఒకప్పుడు కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి ఉన్నవారే అతడికి వ్యతిరేకంగా మారతారు. ఈ పోరాటంలో ఎవరు గెలిచారు? తన ఇంటిని కాపాడుకోవాలన్న యోగేశ్ ప్రయత్నం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? అనేది సినిమాలో చూడాలి.
One building, many lives, and one man determined to protect what matters most. Masterji's fight is far from over. #LastManInTower – watch now only on Hindi Zee 5 #LastManInTowerOnZee5 @BajpayeeManoj @divyadutta25 @bomanirani @BenRekhi @DograGuneet @RanaDaggubati @SpiritMediaIN #LMIT #LastManInTower #ZeeMusicCompany
— Zee 5 (@Zee5_Official) November 5, 2026
ఎలా ఉందంటే?
ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు మాత్రమేనా? లేక అక్కడ గడిపిన జ్ఞాపకాలు, అనుబంధాల సమాహారమా? అనే ప్రశ్నతో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం, డబ్బు ఆశ, మధ్యతరగతి కుటుంబాల కలలు, మనుషుల మధ్య సంబంధాలు వంటి అంశాలను దర్శకుడు కథలో చక్కగా మిళితం చేశారు. మొదట్లో సాధారణ అపార్ట్‌మెంట్ సమస్యగా కనిపించే కథ.. క్రమంగా మనుషుల స్వార్థం, ఆశలు, నైతిక విలువల చుట్టూ తిరుగుతుంది. ఒకరి నిర్ణయం మిగతావారి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది? మెరుగైన భవిష్యత్తు కోసం మనుషులు ఎంతవరకు వెళ్లగలరు? అనే అంశాలను చూపించారు.
►ALSO READ | Varanasi Story: రాజమౌళి-మహేష్ బాబు మూవీ అప్డేట్.. వైరల్ అవుతున్న వారణాసి స్టోరీ ఇదేనా?
ముఖ్యంగా యోగేశ్ ఒంటరిగా అందరినీ ఎదుర్కొనే సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేస్తాయి. అయితే కథనం కొన్ని చోట్ల నెమ్మదిగా సాగుతుంది. మరికొన్ని పాత్రల నేపథ్యాలను ఇంకాస్త బలంగా చూపించి ఉంటే కథకు మరింత డెప్త్ ఉండేదని ఫీలింగ్ ఇస్తుంది. అయినప్పటికీ కథలోని సామాజిక అంశాలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి.
నటీనటుల పెర్ఫార్మెన్స్
మనోజ్ బాజ్‌పాయ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. రిటైర్డ్ టీచర్‌గా ఆయన నటన సహజంగా ఉంటుంది. తన ఇంటిని వదులుకోకుండా పట్టుదలతో నిలబడే వ్యక్తిగా భావోద్వేగాలను అద్భుతంగా పలికించారు. దివ్య దత్తా కూడా తన పాత్రలో ఒదిగిపోయారు. కుటుంబ బాధ్యతలు, కొడుకు భవిష్యత్తు, తన వ్యక్తిగత ఆశల మధ్య నలిగిపోయే మహిళగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా మనోజ్ బాజ్‌పాయ్‌తో ఆమె తలపడే సన్నివేశాలు బాగున్నాయి. బిల్డర్ ధర్మెన్ షా పాత్రలో బొమన్ ఇరానీ తనదైన నటనతో మెప్పించారు. మిగతా నటీనటులు కూడా కథకు తగిన న్యాయం చేశారు.
టెక్నీకల్ అంశాలు..
దర్శకుడు బెన్ రేఖి కథలోని సామాజిక కోణాన్ని తెరపై చూపించడంలో సక్సెస్ అయ్యారు. అరవింద్ అడిగా నవలలోని ప్రధాన భావాన్ని సినిమాకు అనుగుణంగా మలిచారు. నేపథ్య సంగీతం కథలోని భావోద్వేగాలకు తగ్గట్టుగా సాగుతుంది. సినిమాటోగ్రఫీ పాత ముంబై అపార్ట్‌మెంట్ వాతావరణాన్ని సహజంగా ఆవిష్కరించింది. అయితే స్క్రీన్‌ప్లే మరింత గ్రిప్పింగ్ గా ఉంటే సినిమా ఇంకా బాగుండేది.
ఫైనల్‌గా..
‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’ సాధారణ కమర్షియల్ సినిమా కాదు. ఇల్లు, డబ్బు, మనుషుల మధ్య అనుబంధాలు, స్వార్థం వంటి అంశాలపై ఆలోచింపజేసే ఎమోషనల్ డ్రామా. నిజానికి ఇదొక అద్భుతమైన మానవీయ కథ. మనం జీవితంలో తీసుకునే నిర్ణయాలు, దేనిని వదులుకోవడానికి ఇష్టపడతాం? దేనిని చివరి వరకు పట్టుకుని ఉంటాం? అనే అంశాలను ఈ సినిమాలో చూపించిన తీరు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.
