కర్నాటక బాటలోనే కేరళ.. బంకుల్లో E20 పెట్రోల్ చెకింగ్ షురూ

కర్నాటక బాటలోనే కేరళ.. బంకుల్లో E20 పెట్రోల్ చెకింగ్ షురూ

తిరువనంతపురం: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన E20 పెట్రోల్‎లో ఇథనాల్ 20 శాతానికి మించి ఉందన్న కర్నాటక ప్రభుత్వ ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. కర్నాటక ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన E20 పెట్రోల్ శాంపిల్స్‎ను పరీక్షించగా ఇథనాల్ 31 శాతం వరకు ఉన్నట్లు తేలింది. దీంతో E20 పెట్రోల్‎ మరోసారి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‎గా మారింది. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

 కర్నాటక ప్రభుత్వం మాదిరిగానే కేరళ సర్కార్ కూడా E20 పెట్రోల్‌ నాణ్యత, ఇథనాల్ శాతంపై తనిఖీలు చేపట్టింది. సీఎం వీడి సతీశన్ ఆదేశాల మేరకు సోమవారం (నవంబర్ 9) రంగంలోకి దిగిన అధికారులు రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లోని పెట్రోల్ బంకుల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. వేర్వేరు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెందిన బంకుల నుంచి ఈ20 పెట్రోల్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్‎కు పంపించారు. 

ఈ20 పెట్రోల్‎తో తమ వాహనాలకు నష్టం వాటిల్లుతోందని వాహనదారులు చేసిన ఫిర్యాదులు, ఈ20 ఇంధన నాణ్యతపై ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బంకులు సీజ్ చేస్తామని, బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.

►ALSO READ | అసలు దేశద్రోహి ఎవరో తేల్చుకుందాం రండి.. మోడీ దిమాగీ నక్సల్ వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్

సోమవారం (నవంబర్ 9) సేకరించిన ఈ20 పెట్రోల్ శాంపిల్స్‎ను పరీక్షల కోసం ప్రభుత్వ ప్రయోగశాలలకు పంపుతున్నట్లు కేరళ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి అనూప్ జాకబ్ తెలిపారు.10 రోజుల్లో ఫలితాలు వెలువడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రిపోర్ట్స్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ20 పెట్రోల్‍పై దేశవ్యాప్తంగా వాహనదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోన్న వేళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు వరుసగా ఈ20 ఇంధనంపై తనిఖీలు చేయడం చర్చనీయాంశంగా మారింది.