భారతదేశంలో వృద్ధ జనాభా వేగంగా పెరుగుతోంది. మారుతున్న కాలం, జాబ్స్ రీత్యా పిల్లలు విదేశాలకు, వేరే నగరాలకు వెళ్లిపోతుండటంతో ఓల్డేజ్‌లో ఉన్న తల్లిదండ్రులు ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఈ ఒంటరితనాన్ని పోగొట్టడానికి.. వారి దైనందిన అవసరాలను చూసుకోవడానికి ఇప్పుడు సిటీల్లో సరికొత్త ట్రెండ్ తెరపైకి వచ్చింది. అదే 'అద్దెకు మనమడు' అనే కాన్సెప్ట్. పిల్లలు దగ్గర లేని లోటును తీరుస్తూ.. వృద్ధులకు తోడుగా ఉండేందుకు కొన్ని స్టార్టప్ కంపెనీలు ఈ సేవలను అందిస్తున్నాయి.
గురుగ్రామ్‌లో నివసించే 80 ఏళ్ల ఎస్. బుధిరాజా దంపతుల కూతురు అమెరికాలో సెటిల్ అయ్యారు. దీంతో వారు మార్కెట్‌కు వెళ్లాలన్నా, ఆస్పత్రికి వెళ్లాలన్నా 26 ఏళ్ల రోనీ రాజు అనే యువకుడు వారి వెంటే ఉంటున్నాడు. ఇతన్ని ఆ కుటుంబం తమ ‘అద్దెకు తీసుకున్న మనమడు’గా భావిస్తుంది. కేవలం పనుల కోసం మాత్రమే కాకుండా.. ఆయనతో క్యూరియాసిటీగా మాట్లాడటం, ఇద్దరి మధ్య ఒక మంచి అనుబంధం ఏర్పడటం విశేషం. బుధిరాజా ఆపరేషన్ సమయంలోనూ ఈ యువకుడు దగ్గరుండి అన్ని తానే అయి చూసుకున్నాడు. ఇలాంటి సేవలను అందించేందుకు దేశవ్యాప్తంగా అనేక స్టార్టప్ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి ప్రస్తుతం.
ఐక్యరాజ్యసమితి రిపోర్ట్ ప్రకారం.. 2050 నాటికి భారతదేశంలో 60 ఏళ్లు దాటిన వారి సంఖ్య దాదాపు 35 కోట్లకు చేరుకుంటుంది. ఇంత భారీ సంఖ్యలో ఉన్న వృద్ధులలో చాలామంది తీవ్రమైన ఒంటరితనంతో బాధపడుతున్నారు. తమ పిల్లలతో ఫోన్లో మాట్లాడినప్పటికీ.. దగ్గరుండి మాట్లాడేవారు లేక, తమ బాధలను పంచుకునేవారు లేక కుంగిపోతున్నారు. ఈ సమస్యను గుర్తించిన కొన్ని సంస్థలు.. సైకాలజీ, సోషల్ వర్క్ లేదా హాస్పిటాలిటీలో శిక్షణ పొందిన యువకులను 'కంపానియన్లు'గా పంపుతున్నాయి. వీరు ఓల్డేజ్‌లో ఉన్న వారితో గంటల తరబడి ముచ్చటించడం, కలిసి క్యారమ్స్ ఆడటం, గుడికి, పార్కుకు తోడుగా వెళ్లడం వంటి పనులు చేస్తారు.
►ALSO READ | అది ఎయిర్ పోర్టా.. పిక్నిక్ స్పాటా.. దేశం దాటినా మారరా..? మనోళ్ల సివిక్ సెన్స్‌పై హర్ష గోయెంకా కామెంట్స్
ఈ సేవలు అందించే యువకులు కేవలం జీతం కోసం కాకుండా.. సొంత తాతాబామ్మల లాగా భావించి సేవలు అందిస్తున్నారు. వృద్ధులు కూడా తమ పిల్లలకు చెప్పలేని చిన్న చిన్న అనారోగ్య సమస్యలను ఈ ‘మనమళ్ల’తో పంచుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ బంధం ఎంత బలపడుతుంది అంటే.. వృద్ధులు తమ చివరి క్షణాలలో కూడా వీళ్లే దగ్గరుండి తమ అంత్యక్రియలు జరపాలని కోరుకునేంతగా అనుబంధం పెంచుకుంటున్నారు. అయితే ఈ సేవలకు గంటకు, నెలవారీ ప్రాతిపదికన ఫీజులు ఉంటాయి కాబట్టి ఇది ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోని ఆర్థికంగా స్థిరపడిన కుటుంబాలకే అందుబాటులో ఉంటోంది.
సమాజంలో మారుతున్న జీవనశైలికి తగినట్లుగా వృద్ధుల సంరక్షణ కోసం వస్తున్న ఈ సరికొత్త ట్రెండ్ ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఫ్యామిలీస్ విడిపోయిన చోట, పెద్దలను చూసే వారు కరువైన సమయంలో ఈ 'అద్దెకు మనమడు' కాన్సెప్ట్ ఒంటరితనంతో బాధపడుతున్న ఎంతోమంది వృద్ధులకు కొండంత ధైర్యాన్ని, సంతోషాన్ని అందిస్తోంది. ఇదొక వ్యాపారమే అయినప్పటికీ డబ్బులు తీసుకుని కూడా ఇలా సొంత బిడ్డల్లా వృద్ధులను చూసుకోవటం అంటే మాటలు కాదంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు ఈ అద్దెకు మనమడు సేవల గురించి.
