ప్రపంచంలోనే ప్రముఖ టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన ఎన్విడియా (NVIDIA) పేరు ఇప్పుడు ఒక సంచలన వివాదంతో వార్తల్లో నిలిచింది. ఈ కంపెనీ సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు చైనాకు చెందిన ఆలిస్ హువాంగ్ అనే మహిళతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ వ్యవహారంలో అసలు వివాదం వారి వ్యక్తిగత సంబంధం మాత్రమే కాదు. ఆలిస్ హువాంగ్ చైనా తరఫున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి. ఆమె ద్వారా అమెరికాకు చెందిన కీలకమైన ఏఐ (AI), సెమీకండక్టర్ టెక్నాలజీ సమాచారాన్ని చైనాకు చేరవేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమయ్యాయని కొన్ని వార్తా కథనాలు పేర్కొన్నాయి.
మరోవైపు, జెన్సన్ హువాంగ్‌కు వివాహేతర సంబంధం ఉందనే ప్రచారం కూడా ఈ వివాదానికి మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది. ఈ ఆరోపణలపై ఎన్విడియా స్పందిస్తూ, మా సీఈఓకు, ఆలిస్ హువాంగ్‌కు మధ్య జరిగిన సమావేశాలు సాధారణ వ్యాపార సంబంధాల్లో భాగమేనని తెలిపింది. అసలు ఈ ఆలిస్ హువాంగ్ ఎవరు? ఆమెకు జెన్సన్ హువాంగ్‌తో పరిచయం ఎలా ఏర్పడింది ? చైనా గూఢచారి అనే ఆరోపణలు ఎందుకు వచ్చాయి ? అంటే....
ఆలిస్ హువాంగ్ ఎవరు ?
ఆలిస్ హువాంగ్ చైనాకు చెందిన వ్యాపారవేత్త. మీడియా, బ్యాంకింగ్, పెట్టుబడులు, టెక్నాలజీ వంటి విభిన్న రంగాల్లో ఆమె పనిచేసినట్లు వార్తా కథనాలు చెబుతున్నాయి. ఆమె కెరీర్‌ను పరిశీలిస్తే మొదట జర్నలిజం రంగంలో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. చైనాలోని హునాన్ టీవీ, సీసీటీవీ (CCTV) వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్‌గా పనిచేశారు. అంటే టెలివిజన్ వార్తలు, మీడియా కార్యక్రమాలకు సంబంధించిన బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత మీడియా రంగాన్ని విడిచిపెట్టి ఆర్థిక రంగంలోకి అడుగుపెట్టారు. హెచ్ఎస్బీసీ (HSBC), సిటిక్ సెక్యూరిటీస్ (CITIC Securities) వంటి సంస్థలతో ఆమెకు అనుబంధం ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.
ఇక్కడితో ఆమె కెరీర్ ఆగిపోలేదు. తర్వాత టెక్నాలజీ, ముఖ్యంగా ఏఐ, సెమీకండక్టర్ రంగాలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో షాంఘై కేంద్రంగా పనిచేసే హుసి లేదా హెషి క్యాపిటల్ అనే పెట్టుబడి సంస్థతో సంబంధం ఏర్పరచుకున్నారు. ఈ సంస్థ ఏఐ, చిప్ తయారీ, సెమీకండక్టర్ వంటి రంగాల్లో పెట్టుబడులకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహిస్తుంది. తర్వాత సింగపూర్ కేంద్రంగా పనిచేసే మెగాస్పీడ్ అనే సంస్థలో కీలక బాధ్యతలు చేపట్టారు.
మెగాస్పీడ్లో ఆలిస్ హువాంగ్
ఆలిస్ హువాంగ్ పేరు అంతర్జాతీయంగా ఎక్కువగా వినిపించడానికి ప్రధాన కారణం మెగాస్పీడ్ సంస్థతో ఆమెకున్న సంబంధమే. మెగాస్పీడ్ అనేది డేటా సెంటర్లు, ఏఐ కంప్యూటింగ్ వంటి రంగాల్లో పనిచేసే సంస్థ. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇలాంటి కంపెనీలకు ఎన్విడియా తయారుచేసే అత్యాధునిక చిప్‌లు చాలా అవసరం. సమాచారం ప్రకారం, మెగాస్పీడ్ సంస్థలో ఆలిస్ హువాంగ్ సీఈఓగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. అయితే కంపెనీ ప్రారంభ దశలోని కొన్ని అధికారిక రికార్డుల్లో ఆమెను మేనేజింగ్ డైరెక్టర్‌గా పేర్కొన్నట్లు సమాచారం. తర్వాత ఆమె పేరును తొలగించినట్లు కూడా నివేదికలు చెబుతున్నాయి. ఈ సంస్థకు ఎన్విడియా చిప్‌లతో ప్రత్యేకమైన వ్యాపార సంబంధం ఉండటం వల్లే ఆలిస్ హువాంగ్ పేరు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
►ALSO READ | ఆ చైనీస్ స్పై ఏజెంట్‌తో ఎఫైర్ నిజమే: సంస్థకు, ఫ్యామిలీకి ఎన్విడియా సీఈఓ క్షమాపణలు
జెన్సన్ హువాంగ్‌తో ఆలిస్ హువాంగ్‌కు పరిచయం
ఆలిస్ హువాంగ్, ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు బంధువు కాదు. ఇద్దరి మధ్య ఎలాంటి కుటుంబ సంబంధం లేదు. వీరిద్దరి పరిచయం వ్యాపార, టెక్నాలజీ రంగాల ద్వారా ఏర్పడినట్లు తెలుస్తోంది. 2024 జూన్‌లో తైవాన్‌లోని తైపే నగరంలో జరిగిన ఒక సమావేశం తర్వాత వీరిద్దరి పరిచయం గురించి వార్తలు బయటకు వచ్చాయి.
ఒక బార్లో ఏఐ, టెక్నాలజీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కలిసి సమావేశమయ్యారు. ఆ సమయంలో ఆలిస్ హువాంగ్‌తో పాటు ఇతర వ్యాపారవేత్తలు కూడా అక్కడ ఉన్నారు. ఆ బృందంలో జెన్సన్ హువాంగ్ను కూడా ఆహ్వానించగలనని ఆలిస్ చెప్పినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. తరువాత జెన్సన్ హువాంగ్ కూడా అక్కడికి వచ్చారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలు లింక్డ్ఇన్లో బయటకు రావడంతో వీరిద్దరి మధ్య పరిచయం గురించి చర్చ మొదలైంది. ఎన్విడియా వివరణ ప్రకారం, జెన్సన్ హువాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లు, వ్యాపార భాగస్వాములతో తరచూ సమావేశమవుతుంటారు. ఇది ఆయన ఉద్యోగ బాధ్యతల్లో భాగమే. అందువల్ల ఆలిస్ హువాంగ్‌తో ఆయన మాట్లాడటం కూడా సాధారణ వ్యాపార సంబంధాల్లో భాగమేనని కంపెనీ చెబుతోంది.
ఆలిస్ హువాంగ్‌పై చైనా గూఢచారి ఆరోపణలు
ఈ వ్యవహారంలో అత్యంత తీవ్రమైన అంశం ఇదే. అమెరికా నిఘా సంస్థలు ఆలిస్ హువాంగ్‌పై అనుమానాలు వ్యక్తం చేశాయని, ఆమె చైనా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తూ కీలక సమాచారాన్ని బీజింగ్‌కు చేరవేస్తున్నారని వార్తలు వచ్చాయి. దింతో ఆలిస్ హువాంగ్‌కు జెన్సన్ హువాంగ్‌తో ఉన్న సన్నిహిత పరిచయాలపై కూడా అమెరికా నిఘా సంస్థలు దృష్టి పెట్టాయి. అంతేకాదు, ఈ విషయాలను దాదాపు ఏడాది ముందే అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తెలియజేసినట్లు కూడా వార్తల్లో పేర్కొంది. అయితే ఈ సమాచారంపై అప్పట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదని వార్తలు చెబుతున్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఇవి వార్తా కథనాల్లో వచ్చిన ఆరోపణలు మాత్రమే. ఆలిస్ హువాంగ్ నిజంగానే చైనా గూఢచారి అని బహిరంగంగా తేలాల్సి ఉంది. అలాగే ఆమె జెన్సన్ హువాంగ్ నుంచి ఏదైనా రహస్య సమాచారాన్ని సేకరించి చైనాకు పంపించారనే విషయం కూడా ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు.
జెన్సన్ హువాంగ్ వివాహేతర సంబంధం
ఈ వివాదంలో మరో అంశం జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించినది. ఆయనకు వివాహేతర సంబంధం ఉందనే ఆరోపణలు వార్తల్లోకి వచ్చాయి. అయితే ఆ సంబంధం ఆలిస్ హువాంగ్తోనే ఉందని స్పష్టంగా నిర్ధారించే ఆధారాలు లేవు. వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన ప్రచారం ఒకవైపు ఉంటే, కంపెనీ వ్యాపార రహస్యాలు బయటకు వెళ్లాయా లేదా అన్నది మరో కీలకమైన అంశం. ఎన్విడియా బోర్డు ఈ వ్యవహారాన్ని పరిశీలించినట్లు, ఎలాంటి కీలకమైన రహస్య వ్యాపార సమాచారం బయటకు వెళ్లినట్లు కనిపించడం లేదని తెలిపినట్లు సమాచారం. జెన్సన్ హువాంగ్ కూడా విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి.
ఎన్విడియా, మెగాస్పీడ్ సంస్థలు ఏం చెబుతున్నాయి?
ఈ ఆరోపణలు బయటకు రావడంతో మెగాస్పీడ్ సంస్థ స్పందించింది. ఆలిస్ హువాంగ్‌పై వచ్చిన ఆరోపణలను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపింది. ఈ వ్యవహారంపై సమగ్రంగా పరిశీలన జరిపేందుకు బయటి న్యాయ నిపుణులను నియమించుకున్నట్లు వెల్లడించింది. మరోవైపు, ఎన్విడియా మాత్రం సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు ఆలిస్ హువాంగ్‌తో ఉన్న పరిచయాన్ని సాధారణ వ్యాపార సంబంధంగానే చెప్పుకొచ్చింది. ఎన్విడియా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లను కలవడం, వారితో మాట్లాడటం, కంపెనీ ఉత్పత్తులు, వ్యాపార అవకాశాల గురించి చర్చించడం జెన్సన్ హువాంగ్ విధుల్లో భాగం.
మెగాస్పీడ్కు కూడా సాధారణ వ్యాపార సమాచారం మాత్రమే అందిందని, ఎలాంటి కీలకమైన వాణిజ్య రహస్యాలను పంచుకున్నట్లు లేదని కంపెనీ స్పష్టం చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. అలాగే భద్రతాపరమైన ముప్పు ఏదైనా ఉంటే అమెరికా ప్రభుత్వం తమకు తెలియజేస్తుందని ఆశిస్తున్నట్లు ఎన్విడియా తెలిపింది. ఈ మొత్తం వివాదాన్ని కేవలం ఇద్దరు వ్యక్తుల పరిచయం లేదా వ్యక్తిగత సంబంధానికి మాత్రమే పరిమితం చేసి చూడలేం. దీనికి ప్రధాన కారణం అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న టెక్నాలజీ పోటీ. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ రంగంలో ఆధిపత్యం సాధించేందుకు అమెరికా, చైనా తీవ్రంగా పోటీపడుతున్నాయి. ఈ పోటీలో ఎన్విడియా తయారుచేసే అత్యాధునిక ఏఐ చిప్‌లకు చాలా కీలకమైన స్థానం ఉంది.
ఏఐ మోడళ్లను అభివృద్ధి చేయడానికి, భారీ స్థాయిలో డేటాను ప్రాసెస్ చేయడానికి, సూపర్ కంప్యూటర్లను నిర్మించడానికి ఈ చిప్‌లు అవసరం. అందుకే అమెరికా తన అత్యాధునిక చిప్ టెక్నాలజీ చైనాకు చేరకుండా అనేక ఆంక్షలు విధిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్విడియా అధినేతకు చైనా వ్యాపారవేత్తతో సన్నిహిత పరిచయం ఉందని, ఆమెపై గూఢచర్యం ఆరోపణలు ఉన్నాయని వార్తలు రావడం సహజంగానే అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ఒకవేళ నిజంగానే ఎన్విడియాకు సంబంధించిన కీలకమైన సాంకేతిక సమాచారం బయటకు వెళ్లినట్లు తేలితే, అది కేవలం ఒక కంపెనీకి సంబంధించిన సమస్యగా కాకుండా అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా మారే అవకాశం ఉంటుంది.
చివరికి ఈ వ్యవహారంలో
ప్రస్తుతం ఆలిస్ హువాంగ్ వ్యవహారంలో అమెరికా నిఘా సంస్థలు ఆమెపై అనుమానాలు వ్యక్తం చేశాయని వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. జెన్సన్ హువాంగ్‌తో పరిచయం ఉన్నట్లు వార్తలు, ఫొటోలు బయటకు వచ్చాయి. అయితే ఆ పరిచయం ద్వారా ఎన్విడియా రహస్య సమాచారం చైనాకు చేరిందనే విషయం నిర్ధారణ కాలేదు. మొత్తానికి, ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు నిజాలు పూర్తిగా బయటకు రావాలంటే సంబంధిత దర్యాప్తు, విచారణ వివరాలు స్పష్టంగా వెల్లడికావాల్సి ఉంది.
