అది ఎయిర్ పోర్టా.. పిక్నిక్ స్పాటా.. దేశం దాటినా మారరా..? మనోళ్ల సివిక్ సెన్స్పై హర్ష గోయెంకా కామెంట్స్

అది ఎయిర్ పోర్టా.. పిక్నిక్ స్పాటా.. దేశం దాటినా మారరా..?  మనోళ్ల సివిక్ సెన్స్పై  హర్ష గోయెంకా కామెంట్స్

ఏ దేశమేగినా ఎందు కాలిడినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని.. అని అప్పట్లో ఓ గొప్ప దేశభక్తుడు రాశారు. మనం పొగడకపోయినా పర్లేదు.. దేశ ప్రతిష్టను పెంచక పోయినా పర్లేదు.. కానీ దిగజార్చకుంటే చాలు అనుకోవాలి కొన్ని ఘటనలు చూస్తుంటే. మనోళ్లు ఎక్కడికి వెళ్తే అక్కడ పరిసరాలు కంపు లేపడం.. ఇతరులకు ఇబ్బంది కలిగించడం లాంటి ఘటనలతో ఈ మధ్య కొందరు విదేశీయులు ఏకంగా వీడియోలు తీసి పెడుతున్నారు. ఇండియన్స్ సివిక్ సెన్స్ అంటూ. అలాంటిదే ఒక ఘటనపై ప్రముఖ పారిశ్రామిక వేత్త చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.  

వియత్నాంలోని ఒక విమానాశ్రయంలో ఇండియన్ టూరిస్టులు  నేలమీద కూర్చుని భోజనం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మన ఇంట్లో జరిగిన దావత్ కు అందరూ కూర్చుని తిన్నట్లుగా ఎయిర్ పోర్టులో, కుర్చీల మధ్య బంతి భోజనాలు చేయడం విమర్శలకు దారి తీసింది. ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది అని ఆలోచించరా వీళ్లు అసలు అంటూ అక్కడున్న వాళ్లు మాట్లాడుకున్నారు. ఈ  దృశ్యాలను చూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా తీవ్రంగా స్పందించారు.

విమానాశ్రయంలో ప్యాసెంజర్లు వేచి ఉండటానికి, నడవటానికి ఉపయోగపడే ప్రాంతాన్ని పిక్నిక్ స్పాట్‌లా మార్చుకున్న తీరును చాలా మంది అసహ్యించుకున్నారు. ఈ వీడియోను ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసిన హర్ష్ గోయెంకా, వియత్నాం ఇప్పుడు ఇండియన్స్ కు ఇష్టమైన టూరిస్ట్ గమ్యస్థానంగా మారింది. కానీ వారి ఎయిర్ పోర్టులను పిక్నిక్ స్పాట్‌లుగా మార్చి, బంతి భోజనాలు చేసి,  చెత్త వేస్తే మనం వారికి అన్ పాపులర్ (అప్రియమైన) టూరిస్టులుగా మారే ప్రమాదం ఉంది. సివిక్ సెన్స్‌తో ప్రయాణించడం మనం ఎప్పుడు నేర్చుకుంటాం? అని ట్వీట్ లో ప్రశ్నించారు.

ఆయన పోస్ట్‌కు చాలా మంది స్పందించారు. కొందరు ఇలాంటి ప్రవర్తనను విమర్శిస్తూ, పబ్లిక్ స్పేస్‌లను గౌరవించాలని అన్నారు. కొంతమంది సింగపూర్ లాంటి దేశాల్లో ఇలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.  భారతీయులు ఇలా చేయరని కొందరు సమర్ధించారు.  కొందరు వాళ్ల పాస్‌పోర్ట్‌లు రద్దు చేయాలని డిమాండ్ చేయడం కూడా కామెంట్స్ లలో చూడవచ్చు. 

ఈ  ఘటన విదేశాల్లో ఇండియన్ టూరిస్టుల  ప్రవర్తనపై మళ్లీ చర్చను రేకెత్తించింది. విదేశాల్లో పర్యాటకంగా వెళ్లేటప్పుడు స్థానిక నిబంధనలను పాటించడం, పబ్లిక్ ప్రదేశాలను శుభ్రంగా ఉంచడం అవసరమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దేశం ప్రతినిధులుగా ప్రవర్తించాలని సోషల్ మీడియా యూజర్లు కామెంట్స్ చేస్తున్నారు.