ఢిల్లీ కాలుష్యంపై కుట్ర..కావాలనే  పంజాబ్ లో పొలాలకు నిప్పు..మంత్రి సంచలన ఆరోపణలు

ఢిల్లీ  కాలుష్యంపై  కుట్ర..కావాలనే  పంజాబ్ లో పొలాలకు నిప్పు..మంత్రి సంచలన ఆరోపణలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంపై రాజకీయ వివాదం ముదురుతోంది. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎయిర్ క్వాలిటీకి సంబంధించిన లెక్కలను  తారుమారు చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత సౌరభ్ భరద్వాజ్ ఆరోపించిన కొద్ది గంటల్లోనే ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీకి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో భాగంగానే పంజాబ్‌లోని వ్యవసాయ పొలాలకు ఉద్దేశపూర్వకంగా నిప్పు పెడుతున్నారని ఆయన ఆరోపించారు.

పంజాబ్‌లోని రైతులు రాత్రివేళల్లో వ్యవసాయ పొలాలకు నిప్పు పెడుతున్న ఘటనలపై తనకు, ఢిల్లీ ప్రభుత్వంలోని ఇతర సభ్యులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారని కపిల్ మిశ్రా తెలిపారు. నవంబర్ 7న 125 వ్యవసాయ క్షేత్రాల్లో అగ్నిప్రమాదాలు జరిగినట్లు ఉపగ్రహ డేటా వెల్లడించిందని, దీపావళి రాత్రికి ఈ సంఖ్య 1,200కు చేరిందన్నారు.

ఈ ఘటనలు రైతులకు, ఢిల్లీ ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో భాగమని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతల పాత్రపై విచారణ జరపాలని పంజాబ్ ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. ఢిల్లీ నుంచి ఆప్ నాయకులు పర్యటించిన ప్రాంతాల్లోనే ఈ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, సంబంధిత నాయకుల ఫోన్ కాల్ రికార్డులను పరిశీలించాలని కోరారు.దీపావళి పండుగను అపఖ్యాతి పాలు చేసే ప్రచారం రెండు రోజుల ముందే ప్రారంభమైందని కూడా మిశ్రా వ్యాఖ్యానించారు.

ALSO READ : పెట్రోల్ కారులో డీజిల్ లేదా డీజిల్ కారులో పెట్రోల్ పోస్తే ఏమవుతుందో తెలుసా ?

మరోవైపు, ఢిల్లీలో అధికారికంగా వెల్లడిస్తున్న వాయు నాణ్యత గణాంకాలు వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించడం లేదని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు.దీపావళి రాత్రి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ (AQI) 3,000 దాటిందన్నారు. ఈ మేరకు స్వతంత్ర గాలి నాణ్యత పర్యవేక్షణ వేదికల సమాచారాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్టు చేశారు.అంతేకాకుండా, సుమారు 20 కొత్త గాలి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలను జనసంచారం, కాలుష్యం తక్కువగా ఉండే పచ్చదనం ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేశారని ఆరోపించారు. మరోవైపు, అధిక కాలుష్యం నమోదయ్యే ప్రాంతాల్లోని పర్యవేక్షణ కేంద్రాల సమీపంలో నీటిని చల్లడం ద్వారా రీడింగ్‌లను తగ్గించే ప్రయత్నం జరుగుతోందని రెండు వీడియోలను విడుదల చేశారు.