Ramayana Box Office: దీపావళి బాక్సాఫీస్ కింగ్‌గా ‘రామాయణం’.. ఆదివారం ఒక్కరోజే ఇన్నికోట్లా?

Ramayana Box Office: దీపావళి బాక్సాఫీస్ కింగ్‌గా ‘రామాయణం’.. ఆదివారం ఒక్కరోజే ఇన్నికోట్లా?

భారతీయ సినీ చరిత్రలో మరో భారీ విజయం నమోదైంది. బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణం: పార్ట్ 1’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. నవంబర్ 5న విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ముఖ్యంగా దీపావళి వీకెండ్‌లో కలెక్షన్లు మరింత పుంజుకున్నాయి. దీపావళి రోజైన ఆదివారం ఒక్కరోజే ఏకంగా రూ.56.15 కోట్ల నెట్ వసూళ్లు సాధించి సత్తా చాటింది. తొలి వీకెండ్ ముగిసే సమయానికి ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.500 కోట్ల వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. భారత్‌తో పాటు ఓవర్సీస్ మార్కెట్లలోనూ సత్తా చాటుతూ పలు రికార్డులను అధిగమించే దిశగా దూసుకెళ్తోంది.

2026లో టాప్-5లోకి ‘రామాయణం’ ఎంట్రీ..

2026లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన బాలీవుడ్ మూవీస్ లిస్ట్ లోనూ ‘రామాయణం’ చోటు దక్కించుకుంది. బాలీవుడ్ ట్రేడ్ లెక్కల ప్రకారం.. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.412.77 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్‌తో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రాల్లో ఐదో స్థానంలో నిలిచింది. ఈ లిస్ట్ లో ‘ధురంధర్: ది రివెంజ్’, ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’, ‘బోర్డర్ 2’, ‘హనుమాన్ అంష్’ చిత్రాలు తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

ALSO READ : తీన్మార్ స్టెప్పులతో అదరగొట్టిన నాగదుర్గ..

నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్లు!

నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీపావళి పండుగ సెలవులు సినిమాకు కలిసిరావడంతో వీకెండ్‌లో వసూళ్లు భారీగా పెరిగాయి. తొలి నాలుగు రోజుల్లోనే ఇండియాలో రూ.238.85 కోట్లకి పైగా నెట్, రూ.285 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలిపాయి. ఓవర్సీస్‌లో మరో రూ.214 కోట్ల గ్రాస్‌ను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.  దీంతో ప్రపంచవ్యాప్తంగా రామాయణం మొత్తం వసూళ్లు రూ.500 కోట్లుగా నమోదయ్యాయి.

ఓవర్సీస్‌లోనూ రికార్డుల వేట.. పఠాన్‌కు గట్టి పోటీ!

విదేశీ మార్కెట్లలోనూ ‘రామాయణం’ అదరగొడుతోంది. అమెరికాలో 9.20 మిలియన్ డాలర్లు, యూకేలో 2.20 మిలియన్ పౌండ్ల వసూళ్లు సాధించింది. మొత్తంగా ఓవర్సీస్‌లో 23.25 మిలియన్ డాలర్లకు పైగా రాబట్టింది. దీంతో ‘పఠాన్’ పేరిట ఉన్న 25.50 మిలియన్ డాలర్ల ఓపెనింగ్ రికార్డుకు చేరువైంది. ఒకే రిలీజ్ ఫ్రేమ్‌ను పరిగణనలోకి తీసుకుంటే పఠాన్‌ను అధిగమించే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

టైగర్ 3’, ‘ఆదిపురుష్’ రికార్డులకు చెక్..

దీపావళి సందర్భంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలోనూ ‘రామాయణం’ సంచలనం సృష్టించింది. 2023లో సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ 3’ దీపావళి రోజున రూ.44.50 కోట్ల నెట్ వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. అయితే ‘రామాయణం’ ఆదివారం ఒక్కరోజే రూ.56.15 కోట్ల నెట్ వసూళ్లు సాధించి ఆ రికార్డును అధిగమించింది.

అంతేకాదు.. ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ తొలి నాలుగు రోజుల్లో భారత్‌లో సాధించిన రూ.237 కోట్ల నెట్ వసూళ్లను కూడా ‘రామాయణం’ అధిగమించింది. దీంతో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది.

ఇక ముందు మరిన్ని రికార్డులేనా?

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రామాయణం’కు రానున్న రోజులు కీలకం కానున్నాయి. ఓవర్సీస్‌లో ఇదే జోరు కొనసాగితే ‘జవాన్’ పేరిట ఉన్న అత్యధిక విదేశీ వసూళ్ల రికార్డును అధిగమించే అవకాశం ఉంది. ట్రేడ్ అంచనాల ప్రకారం.. ఈ చిత్రం ఓవర్సీస్‌లో 50 మిలియన్ డాలర్ల మార్కును దాటి, అనుకూల పరిస్థితుల్లో 60 మిలియన్ డాలర్ల వరకు వసూళ్లు సాధించవచ్చు. భవిష్యత్తులో చైనాలో విడుదలైతే అక్కడి వసూళ్లు కూడా కీలకం కానున్నాయి. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటించిన ఈ చిత్రం తొలి వీకెండ్‌లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల మార్కును అందుకుంది. మరి ఫుల్ రన్‌లో ఇంకెన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి!